దుబాయ్ వానలకు భారత రెజ్లర్ల జోడీ చిత్తు!
పారిస్ ఒలింపిక్స్ అర్హత పోటీలలో పాల్గొనటానికి బయలు దేరిన భారత వస్తాదుల జోడీకి దుబాయ్ విమానాశ్రయంలో చేదుఅనుభవం ఎదురయ్యింది.
పారిస్ ఒలింపిక్స్ అర్హత పోటీలలో పాల్గొనటానికి బయలు దేరిన భారత వస్తాదుల జోడీకి దుబాయ్ విమానాశ్రయంలో చేదుఅనుభవం ఎదురయ్యింది.
చివరకు అర్హత పోటీలలో పాల్గొనే అవకాశాన్ని చేజార్చుకొన్నారు.
పారిస్ వేదికగా మరో మూడుమాసాలలో ప్రారంభంకానున్న ఒలింపిక్స్ కు అర్హత సాధించాలన్న భారత వస్తాదుల జోడీ దీపక్ పూనియా, సుజీత్ కలాకల్ ల ఆశలపై దుబాయ్ వానలు నీళ్లు చల్లాయి.
కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఆసియా ప్రాంత ఒలింపిక్స్ కుస్తీ అర్హత పోటీలలో పాల్గొనటానికి భారత వస్తాదుల జట్టు దుబాయ్ మీదుగా రెండు బృందాలుగా బయలుదేరి వెళ్లింది. 17 మంది సభ్యుల మొదటి బృందం సకాలంలో కజకిస్థాన్ చేరుకోగా..ఇద్దరు సభ్యుల ( దీపక్, సుజీత్ ) బృందం మాత్రం దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది.
అకాలవర్షాలతో అల్లకల్లోలం....
సింధుశాఖ దేశాలు, ప్రధానంగా దుబాయ్ ను రెండురోజులపాటు అకాలవర్షాలు అతలాకుతలం చేశాయి. దాంతో దుబాయ్ విమానాశ్రయానికి వచ్చే విమానసర్వీసులకు తీవ్రఅంతరాయం ఏర్పడింది.
అప్పటికే దుబాయ్ చేరిన భారత వస్తాదుల జోడీ బయలుదేరాల్సిన కజకిస్థాన్ విమాన సర్వీసు సైతం ఆలస్యమయ్యింది. దీంతో దీపక్ పూనియా, సుజిత్ సకాలంలో కజకిస్థాన్ రాజధాని బిష్ కెక్ చేరుకోలేకపోయారు. భారత కుస్తీ బృందం ప్రతినిధి సంజయ్ సింగ్ నిర్వాహక సంఘానికి పదేపదే విజ్ఞప్తి చేసినా ఖాతరు చేయలేదు.
దీంతో..అర్హత పోటీలలో పాల్గొనే అవకాశాన్ని దీపక్, సుజీత్ కోల్పోక తప్పలేదు.
ప్రస్తుత ఈ పోటీలలో భాగంగా 18 తరగతులలో 36 ఒలింపిక్స్ బెర్త్ ల అర్హత కోసం వివిధ దేశాల వస్తాదులు తలపడుతున్నారు. పురుషుల 86 కిలోల విభాగంలో దీపక్ పూనియా, 65 కిలోల విభాగంలో సుజీత్ పోటీపడాల్సి ఉంది.
పురుషుల 57 కిలోల విభాగంలో అమన్, 74 కిలోల విభాగంలో జైదీప్, 97 కిలోల విభాగంలో దీపక్, 125 కిలోల విభాగంలో సుమిత్ భారత్ తరపున బరిలో దిగనున్నారు.
దీపక్, సుజీత్ లకు మరో అవకాశం..
టర్కీ వేదికగా వచ్చేనెలలో జరిగే ప్రపంచ కుస్తీ అర్హత పోటీలలో పాల్గొనే అవకాశం దీపక్ పూనియా, సుజిత్ లకు ఉంది. స్వర్ణ, రజత పతకాలు సాధించిన వస్తాదులకు మాత్రమే ఒలింపిక్స్ బెర్త్ లు దక్కుతాయి.
ప్రపంచ కుస్తీ అర్హత పోటీల మొదటి రెండుస్థానాలలో నిలువగలిగితేనే దీపక్, సుజిత్ లకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ లు దక్కే అవకాశం ఉంది.
మహిళల విభాగంలో అమిత్ పంగల్ మాత్రమే 53 కిలోల విభాగంలో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ను ఖాయం చేసుకోగలిగింది.
కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఆసియా కుస్తీ అర్హత పోటీల మహిళల విభాగం 50 కిలోల విభాగంలో వినేశ్ పోగట్, 76 కిలోల విభాగంలో రీతికా హుడా,
57 కిలోల విభాగంలో అంషు, 62 కిలోల విభాగంలో మానసీ, 68 కిలోల విభాగంలో నిషా పోటీకి దిగుతున్నారు.
పారిస్ ఒలింపిక్స్ జులై 11 నుంచి ఆగస్టు మొదటి వారం వరకూ జరుగనున్నాయి. ఈ క్రీడల్లో 204 దేశాలకు చెందిన 19వేల మంది అథ్లెట్లు పోటీపడనున్నారు.