పారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత్ కు క్లిష్టమైన 'డ్రా'!
ఎనిమిదిసార్లు ఒలింపిక్స్ హాకీ విజేత భారత్ కు 2024 ఒలింపిక్స్ పురుషుల విభాగంలో క్లిష్టమైన డ్రా పడింది. హేమాహేమీ జట్ల నుంచి గట్టిపోటీ ఎదుర్కోనుంది..
ఎనిమిదిసార్లు ఒలింపిక్స్ హాకీ విజేత భారత్ కు 2024 ఒలింపిక్స్ పురుషుల విభాగంలో క్లిష్టమైన డ్రా పడింది. హేమాహేమీ జట్ల నుంచి గట్టిపోటీ ఎదుర్కోనుంది..
పారిస్ వేదికగా మరి కొద్దివారాలలో ప్రారంభంకానున్న 2024 ఒలింపిక్స్ హాకీ డ్రా వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య బయటపెట్టింది. ఒలింపిక్స్ హాకీ చరిత్రలోనే అత్యధికంగా ఎనిమిది బంగారు పతకాలు నెగ్గిన ఏకైకజట్టుగా రికార్డు నెలకొల్పిన భారత్ గత ఒలింపిక్స్ లో మాత్రం కాంస్య విజేతగా నిలిచింది.
41 సంవత్సరాల విరామం తరువాత ఒలింపిక్స్ పతకం నెగ్గిన భారతజట్టు..2024 పారిస్ ఒలింపిక్స్ లో సైతం ఏదో ఒక పతకం సాధించాలన్న పట్టుదలతో ఉంది.
గ్రూప్ - బీలో భారత్ పోటీ...
ఒలింపిక్స్ డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం, ప్రపంచ మేటి ఆస్ట్ర్రేలియా, రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లతో కూడిన పూల్ -బీ లీగ్ లో భారత్ తలపడనుంది.
అంతర్జాతీయ హాకీ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 3వ ర్యాంకులో నిలిచిన భారత పురుషుల జట్టు హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటి గా గుర్తింపు తెచ్చుకొంది.
పూల్ - ఏ లీగ్ లో నెదర్లాండ్స్, జర్మనీ, గ్రేట్ బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికాజట్లు తలపడనున్నాయి.
భారత మహిళల విఫలం..
మహిళల విభాగంలో పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడంలో భారతజట్టు విఫలమయ్యింది. రాంచీ వేదికగా జరిగిన ఒలింపిక్స్ అర్హత టోర్నీలో అమెరికా, జర్మనీ, జపాన్, చైనా జట్ల చేతిలో పరాజయాలు పొందిన భారతజట్టు బెర్త్ ఖాయం చేసుకోలేకపోయింది.
మహిళల పూల్ -ఏలో ఒలింపిక్ చాంపియన్ నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీ, జపాన్, చైనా, పూల్ -బీ లో ఆస్ట్ర్రేలియా, అర్జెంటీనా, గ్రేట్ బ్రిటన్, స్పెయిన్, అమెరికా, దక్షిణాఫ్రికాజట్లు తలపడతాయి. గ్రూపు లీగ్ మొదటి నాలుగు స్థానాలలో నిలిచినజట్లు సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లో తలపడనున్నాయి.
పారిస్ ఒలింపిక్స్ 2024 జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ నిర్వహిస్తారు. హాకీ పోటీలు మాత్రం జులై 27 నుంచి ఆగస్టు 9 వరకూ జరుగుతాయి.