46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా
ఒకే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా బిషన్ సింగ్ బేడీ పేరిట ఉన్న రికార్డును అధిగమించిన బుమ్రా
ఆస్ట్రేలియా పర్యటనలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కొనసాగుతున్నాడు. సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌కు టీమిండియా సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఆసీస్ గడ్డపై ఒకే సిరీస్‌లో (కనీసం 5 టెస్టులు) ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఘనత సాధించాడు. స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ పేరిట ఉన్న రికార్డును బుమ్రా అధిగమించాడు.
బిషన్ సింగ్ బేడీ 1977/78 సీజన్లో ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడాడు. ఆ సిరీస్‌లో 31 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు అదే రికార్డు. తాజాగా బుమ్రా 32 వికెట్లు తీసి ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ వికెట్లను తీసిన బుమ్రా ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. కొత్త సంవత్సరంలో అత్యధిక బౌలింగ్ రేటింగ్ సాధించిన భారత బౌలర్‌గా బుమ్రా ఇప్పటికే నిలిచిన విషయం విదితమే. గత ఏడాది 13 టెస్టుల్లో 71 వికెట్లు తీసిన బుమ్రా టాప్ వికెట్ టేకర్ కావడం గమనార్హం.