Telugu Global
Sports

మేరీ కోమ్ కు శాపంగా మారిన 40 ఏళ్ల వయసు!

భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ కెరియర్ కు తెరపడింది. నాలుగు పదుల వయసు మేరీ పాలిట శాపంగా మారింది.

మేరీ కోమ్ కు శాపంగా మారిన 40 ఏళ్ల వయసు!
X

భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ కెరియర్ కు తెరపడింది. నాలుగు పదుల వయసు మేరీ పాలిట శాపంగా మారింది.

మనిషి జీవితమే కాదు..అందులో ఓ భాగంగా ఉన్న క్రీడారంగం సైతం విచిత్రమైనది. రకరకాల ఆటలు, రకరకాల నిబంధనలు. ఓ వైపు టెన్నిస్, ఫుట్ బాల్ లాంటి అంతర్జాతీయ క్రీడల్లో వయసుతో ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా నాలుగు పదుల వయసులోనూ పలువురు క్రీడాకారులు అబ్బురపరచే విజయాలు సాధిస్తుంటే.

ప్రాణాంతక బాక్సింగ్ క్రీడలో మాత్రం పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తోంది.

మేరీ' గోల్డ్' కథ ముగిసినట్లేనా?

భారత మహిళా బాక్సింగ్ కు దశాబ్దాల తరబడి విలక్షణ సేవలు, అంతులేని గుర్తింపు తెచ్చిన మేరీ కోమ్ కెరియర్ కు నిబంధనలు ముగింపు పలికినట్లే కనిపిస్తోంది. 40 ఏళ్ల ప్రాయంలోనూ అంతర్జాతీయ బాక్సర్ గా ఒలింపిక్స్, ప్రపంచ టోర్నీల బరిలో నిలవాలన్న మేరీ ఆశలు అడియాసలయ్యాయి.

ప్రపంచ మహిళా బాక్సింగ్ లైట్ వెయిట్ విభాగంలో భారత్ కు రికార్డుస్థాయిలో ఆరు ప్రపంచ టైటిల్స్ అందించడంతో పాటు..2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించడం ద్వారా మేరీకోమ్ చరిత్ర సృష్టించింది.

అయితే..వయసు మీద పడటం, నిఖత్ జరీన్ లాంటి యువబాక్సర్ల నుంచి గట్టిపోటీ ఎదురుకావడంతో మేరీకోమ్ తిరోగమనం ప్రారంభమయ్యింది. గత కొద్ది నెలలుగా బాక్సింగ్ కు మేరీ కోమ్ దూరంగా ఉంటూ వస్తోంది.

ముగ్గురు పిల్లల తల్లిగా ఓవైపు బాధ్యతలు నిర్వర్తిస్తూనే..మరోవైపు బాక్సర్ గా అసమాన సేవలు అందించిన ఘనత కేవలం మేరీ కోమ్ కే దక్కుతుంది.

నిబంధనలతో మేరీ రిటైర్మెంట్!

అపారఅనుభవం, పట్టుదల, అంకితభావం కలిగిన మేరీ కోమ్ కు నాలుగు పదుల వయసులోనూ కెరియర్ ను కొనసాగించాలన్న ఆసక్తి ఉంది. అవకాశం ఇస్తే ఒలింపిక్స్ బరిలోకి దిగాలన్న పట్టుదల సైతం ఉంది. అయితే..అంతర్జాతీయ బాక్సింగ్ నిబంధనలు, నియమావళి ప్రకారం బాక్సర్ ఎంత గొప్పవారైనా..40వ పుట్టినరోజు తర్వాత రిటైర్ కాకతప్పదు. 40 ఏళ్ళ పైబడిన బాక్సర్లు పోటీలలో పాల్గొనటానికి అనుమతి లేదు. 39 సంవత్సరాల వయసు వరకే అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలలో కొనసాగే అవకాశం ఉంటుంది.

నాలుగు పదుల వయసులోనూ బాక్సర్ గా తన కెరియర్ కొనసాగించాలన్న ఆసక్తి ఉన్నా..నిబంధనల ప్రకారం తాను రిటైర్ కావాల్సిందేనని మేరీ కోమ్ వాపోయింది.

తాను అధికారికంగా బాక్సింగ్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించకపోయినా..అంతర్జాతీయ బాక్సింగ్ నియమావళి ప్రకారం ఆటకు దూరమైనట్లేనని పరోక్షంగా ప్రకటించింది.

రెండున్నర దశాబ్దాల తన సుదీర్ఘ కెరియర్ లో మేరీ కోమ్ 2014 ఆసియాక్రీడల్లో భారత్ కు తొలి బంగారు పతకం సాధించి పెట్టిన తరువాత మరి వెనుదిరిగి చూసింది లేదు.

ఐదు ఆసియా మహిళా బాక్సింగ్ టైటిల్స్ తోపాటు ఆరుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన ఏకైక బాక్సర్ మేరీ కోమ్ మాత్రమే. తన 18వ ఏట అంతర్జాతీయ బాక్సింగ్ అరంగేట్రం చేసిన మేరీ కోమ్ 48 కిలోల విభాగంలో తొలిసారిగా పోటీకి దిగింది. రష్యా వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ పోటీలలో తొలిసారిగా భారత్ కు ప్రాతినిథ్యం వహించింది.

2005, 2006, 2008, 2010 టోర్నీలలో విశ్వవిజేతగా నిలిచింది. 2008లో కవలపిల్లలకు జన్మనిచ్చిన మేరీ ఆ తరువాత మూడో బిడ్డకు జన్మనివ్వడం కోసం బాక్సింగ్ కు తాత్కాలికంగా దూరమయ్యింది.

ముగ్గురు బిడ్డల తల్లిగా 2012 లండన్ ఒలింపిక్స్ బరిలోకి దిగిన మేరీ కోమ్ కాంస్య పతకం సాధించడం ద్వారా బాక్సర్ గా తన కెరియర్ ను పరిపూర్ణం చేసుకోగలిగింది.

ఓవైపున టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బొపన్న 43 సంవత్సరాల వయసులో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ తో పాటు ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించడం ద్వారా ప్రతిభకు వయసు ఏమాత్రం అవరోధం కాదని చాటి చెబితే..మేరీ కోమ్ కు 40 ఏళ్ల వయసు నిబంధన అడ్డంకిగా మారటం దురదృష్టం కాక మరేమిటి.?

First Published:  6 Feb 2024 7:28 AM IST
Next Story