Telugu Global
Sports

పారిస్ ఒలింపిక్స్ లో భారత ముదురు, లేత అథ్లెట్లు!

2024 ఒలింపిక్స్ లో పాల్గొనే 117 మంది సభ్యుల భారత అథ్లెట్లలో అతిపెద్ద నుంచి అతి చిన్నక్రీడాకారులు ఉన్నారు. వీరిలో 44 ఏళ్ల నుంచి 14 సంవత్సరాల వయసున్నవారు పతకాల వేటకు దిగుతున్నారు.

పారిస్ ఒలింపిక్స్ లో భారత ముదురు, లేత అథ్లెట్లు!
X

2024 ఒలింపిక్స్ లో పాల్గొనే 117 మంది సభ్యుల భారత అథ్లెట్లలో అతిపెద్ద నుంచి అతి చిన్నక్రీడాకారులు ఉన్నారు. వీరిలో 44 ఏళ్ల నుంచి 14 సంవత్సరాల వయసున్నవారు పతకాల వేటకు దిగుతున్నారు.

పారిస్ వేదికగా మరి కొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న 2024 ఒలింపిక్స్ లో భారత్ అత్యధిక పతకాలు సాధించాలన్న లక్ష్యంతో 117 మంది అథ్లెట్ల బృందంతో పోటీకి సిద్ధమయ్యింది.

జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరిగే ఈ క్రీడాసంరంభంలో 204 దేశాలకు చెందిన 10వేల మంది అథ్లెట్లు తలపడబోతున్నారు.

రోహన్ బొప్పన నుంచి ధినిధి వరకూ...

ఒలింపిక్స్ లో భాగంగా మొత్తం 32 క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తుంటే..భారత అథ్లెట్లు 16 క్రీడల్లో పాల్గొనటానికి మాత్రమే అర్హత సాధించగలిగారు. మొత్తం 117 మంది సభ్యుల భారత బృందంలో తొలిసారిగా ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్న లేలేత అథ్లెట్ల నుంచి ఆరోసారి పాల్గొనబోతున్న మహాముదురు క్రీడాకారులు సైతం ఉన్నారు.

ప్రారంభవేడుకల్లో భారత పతాకధారుల్లో ఒకరైన 41 సంవత్సరాల టీటీ స్టార్ ఆచంట శరత్ కమల్ ఆరవసారి ఒలింపిక్స్ బరిలో నిలువబోతున్నాడు. 2004 ఒలింపిక్స్ నుంచి శరత్ కమల్ ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ వరకూ భారత్ కు ప్రాతినిథ్యం వహించే అరుదైన అవకాశం దక్కించుకోగలిగాడు.

44 ఏళ్ల వయసులో రోహన్ బొపన్న...

భారత అథ్లెట్ల బృందంలో అత్యంత పెద్ద వయస్కుడుగా టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బొపన్న నిలిచాడు. రోహన్ 44 సంవత్సరాల వయసులో ఒలింపిక్స్ పురుషుల డబుల్స్ బరిలో దిగబోతున్నాడు. 2012 ఒలింపిక్స్ లో మహేశ్ భూపతితో జంటగా పురుషుల డబుల్స్ లో పోటీకి దిగి రెండోరౌండ్లో ఓటమి చవిచూశాడు.

2016 ఒలింపిక్స్ లో లియాండర్ పేస్ తో జంటగా డబుల్స్ లో పాల్గొని తొలిరౌండ్లోనే పరాజయం పొందాడు. 2022 టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించడంలో విఫలమైన రోహన్ నాలుగేళ్ల విరామం తరువాత తిరిగి పారిస్ ఒలింపిక్స్ కు ప్రపంచ 4వ ర్యాంక్ ప్లేయర్ హోదాలో అర్హత సంపాదించగలిగాడు.

ప్రపంచ 62వ ర్యాంకర్ శ్రీరామ్ బాలాజీతో జంటగా పారిస్ ఒలింపిక్స్ పురుషుల డబుల్స్ పతకం వేటకు రోహన్ దిగనున్నాడు.

మిక్సిడ్ డబుల్స్ లో సానియా మీర్జాతో జంటగా ఒలింపిక్స్ లో పాల్గొన్న రోహన్ కాంస్య పతకం పోరులో విఫలమయ్యాడు. ఇక..అత్యంత పిన్నవయస్కురాలైన అథ్లెట్ ఘనతను స్విమ్మర్ ధినిధి ధీసింగు దక్కించుకోనుంది.

ధినిధి వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్న భారత అతిపెద్ద, అతి చిన్న అథ్లెట్లు ఇద్దరూ కర్నాటక రాష్ట్ర్రానికి చెందినవారే కావడం విశేషం.

విశ్వవిద్యాలయ క్రీడాకారుల కోటాలో ధినిధి ఒలింపిక్స్ కు అర్హత సంపాదించగలిగింది. 200 మీటర్ల ఫ్రీ-స్టయిల్ విభాగంలో ధినిధి తలపడనుంది. వందేళ్లకు పైగా కలిగిన భారత ఒలింపిక్స్ చరిత్రలో రెండో పిన్నవయస్కురాలైన అథ్లెట్ గా ధినిధి రికార్డుల్లో చేరనుంది.

1952 హెల్సింకీ ఒలింపిక్స్ లో ఆరతీ సాహా కేవలం 11 సంవత్సరాల చిన్నవయసులో ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిథ్యం వహించింది. ఇప్పుడు ధినిధి ఆ తర్వాతి స్థానంలో నిలువనుంది.

బెంగళూరులోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ధినిధి 200 మీటర్ల ఈతలో వయసుకు మించిన ప్రతిభకనబరుస్తూ ఒలింపిక్స్ బెర్త్ సాధించగలిగింది.

2022 ఆసియా క్రీడలు, 2024 ప్రపంచ అక్వాటిక్స్ పోటీలలో పాల్గొన్న అనుభవం ధినిధికి ఉంది.

భారత బృందంలో 24మంది రక్షణదళాల అథ్లెట్లు...

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్న మొత్తం 117మంది అథ్లెట్లలో భారత రక్షణ దళాల( సర్వీసెస్ )కు చెందిన 24 మంది క్రీడాకారులున్నారు. వీరిలో 22 మంది పురుషులు కాగా..ఇద్దరు మాత్రమే మహిళా అథ్లెట్లున్నారు.

2022 టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన సుబేదార్ నీరజ్ చోప్రా సర్వీసెస్ నుంచి భారతజట్టులో చేరినవాడే. వరుసగా రెండో ఒలింపిక్స్ బంగారు పతకం కోసం నీరజ్ సమాయత్తమయ్యాడు.

హవల్దార్ జాస్మిన్ లాంబోరియా, రితికా హుడా బాక్సింగ్, కుస్తీ క్రీడల్లో పతకాల వేటకు దిగుతున్నారు. షూటింగ్, ఆర్చరీ, ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో సైతం సర్వీసెస్ కు చెందిన పలువురు క్రీడాకారులు భారతజట్టు సభ్యులుగా పాల్గొనబోతున్నారు.

మొత్తం 117 మంది భారత అథ్లెట్లలో సగం మందికి పారిస్ క్రీడలే తొలి ఒలింపిక్స్ కావడం మరో విశేషం.

మహిళల బాక్సింగ్ లో ఏదో ఒక పతకం సాధించగల సత్తా కలిగిన నిఖత్ జరీన్ 2022, 2023 ప్రపంచ బాక్సింగ్ పోటీలలో విజేతగా నిలిచింది. మహిళల జూనియర్ కుస్తీలో పతకం సాధించిన అంతిమ్ పంగల్ సైతం తొలిసారిగా ఒలింపిక్స్ కుస్తీలో పాల్గోనుంది.

బ్యాడ్మింటన్ యంగ్ గన్ లక్ష్యసేన్, హర్డల్స్ రన్నర్ జ్యోతి యర్రాజీ,స్టీపుల్ చేజర్ పారుల్ చౌదరి తొలిసారిగా ఒలింపిక్స్‌ లో పోటీకి దిగుతున్నారు.

First Published:  20 July 2024 10:57 AM GMT
Next Story