ఎలన్ మస్క్ ప్రకటనతో.. ఓఎస్‌లో మార్పులు చేస్తున్న ఆండ్రాయిడ్, యాపిల్.!
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇటీవల ఓ ప్రకటన చేశారు
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇటీవల ఓ ప్రకటన చేశారు. భూమి మీద సెల్ ఫోన్ సిగ్నల్ లేని ప్రాంతమే లేకుండా చేసే ప్రాజెక్టును టీ-మొబైల్ సహాయంలో ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. సెల్ టవర్ సిగ్నల్ లేని ప్రాంతంలో శాటిలైట్ సహాయంతో సిగ్నల్ అందిస్తామని.. అందుకు ఇప్పుడున్న ఫోన్లలో పెద్దగా మార్పులు అవసరం ఉండదని.. సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేస్తే సరిపోతుందని ఆయన ప్రకటించారు. ఎలన్ మస్క్ ప్రకటనతో మొబైల్ సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు అప్రమత్తం అయ్యాయి.
ప్రపంచంలో అత్యధిక ఫోన్లలో ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేరే ఉంటుంది. ఆ ఓఎస్‌లలో చిన్న మార్పులు చేస్తే అన్ని ఫోన్లు శాటిలైట్‌తో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే గూగుల్ సంస్థ తమ మొబైల్ ఓఎస్ ఆండ్రాయిడ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొన్నది. రాబోయే కొత్త వెర్షన్‌లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని చెప్పింది. ఆండ్రాయిడ్ 14 వెర్షన్‌తో వచ్చే ఫోన్లు సెల్ టవర్ సిగ్నల్సే కాకుండా శాటిలైట్ సిగ్నల్స్ కూడా అందుకుంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆండ్రాయిడ్ ఓఎస్ విభాగపు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హిరోషి లోషిమెర్ ప్రకటించారు.
మరోవైపు ఈ నెలలో ఐఫోన్ 14 మోడల్ కూడా అందుబాటులోకి రానున్నది. ఈ ఫోన్ నడిచే ఐవోస్ సాఫ్ట్‌వేర్‌లో ఇప్పటికే మార్పులు చేసినట్లు తెలుస్తున్నది. ఈ ఫోన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే యాపిల్ సంస్థ ఈ ఫీచర్‌పై ఇప్పటి వరకు ప్రకటన చేయకపోయినా.. శాటిలైట్ కనెక్టివిటీ మాత్రం కచ్చితంగా ఉంటుందనే ప్రచారం జరుగుతున్నది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే టవర్ నెట్‌వర్క్‌తో పాటు శాటిలైట్ నెట్‌వర్క్‌ను కూడా ఉపయోగించే అవకాశం ఉన్నది.
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ కొత్త మోడల్ విడుదల అయినా.. కేవలం కొన్ని దేశాల్లో మాత్రమే శాటిలైట్ నెట్‌వర్క్ ఫీచర్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ముందుగా అమెరికా, కెనడా, ఇంగ్లాండ్‌లో ఈ ఫీచర్ పని చేస్తుందని యాపిల్ సంస్థ వర్గాలు చెబుతున్నాయి