సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయితే ఇలా చేయొచ్చు!
ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లతోపాటు సామాన్యుల అకౌంట్లు కూడా హ్యాకింగ్ బారిన పడడం ఇటీవల ఎక్కువైంది.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. అంతేకాదు, ఈ అకౌంట్స్‌లో ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని కూడా సేవ్ చేస్తుంటారు చాలామంది. మరి ఈ ప్లాట్‌ఫామ్స్ ఎప్పుడైనా హ్యాకర్ల చేతికి చిక్కితే ఏం చేయాలి?
ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లతోపాటు సామాన్యుల అకౌంట్లు కూడా హ్యాకింగ్ బారిన పడడం ఇటీవల ఎక్కువైంది. అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బు చెల్లించాలని బెదిరించడం, డబ్బు కావాలని ఫ్రెండ్స్‌కు మెసేజ్ చేయడం వంటివి చేస్తుంటారు సైబర్ నేరగాళ్లు. ఇలా సోషల్ మీడియా అకౌంట్ వేరొకరి చేతిలోకి వెళ్లినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఫేస్‌బుక్, ట్విటర్(ఎక్స్), ఇన్‌స్టాగ్రామ్.. ఇలా ఏదైనా సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయినప్పుడు ‘ఫర్‌గాట్ పాస్‌వర్డ్’పై నొక్కి వెంటనే పాస్‌వర్డ్ మార్చే ప్రయత్నం చేయాలి. అలాగే అన్ని యాక్టివ్ డివైజ్‌ల నుంచి అకౌంట్‌ను లాగవుట్ చేసేయాలి. తిరిగి పాస్‌వర్డ్ పెట్టేటప్పుడు క్యాప్స్, నెంబర్, సింబల్‌తో కూడిన స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టాలి. అలాగే ఒకే పాస్‌వర్డ్ ఇతర అకౌంట్లకు కూడా సెట్ చేసి ఉంటే వాటిని కూడా వెంటనే మార్చుకోవడం మంచిది.
ఒకవేళ హ్యాకర్లు పాస్‌వర్డ్ మార్చే వీలు లేకుండా డీటెయిల్స్ అన్నీ మార్చేస్తే.. మెటా లేదా ట్విటర్ యాజమాన్యానికి రిపోర్ట్ చేయాలి. మీ డీటెయిల్స్‌తో సోషల్ మీడియా సంస్థకు కంప్లెయింట్ చేయడం ద్వారా మీ అకౌంట్‌ను వెంటనే బ్లాక్ చేసే వీలుంటుంది. అకౌంట్ హ్యాకింగ్‌కు గురైనప్పుడు రిపోర్ట్ చేయటానికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా ఫీచర్లున్నాయి.
ఇకపోతే అకౌంట్ హ్యాక్ అయినప్పుడు సదరు హ్యాకర్లు మీ అకౌంట్ నుంచి మీ ఫ్రెండ్స్‌కు మెసేజ్‌లు చేసి అత్యవసరంగా డబ్బు కావాలని అడుగుతుంటారు. కాబట్టి మీ కాంటాక్ట్స్ అందరికీ మీ అకౌంట్ హ్యాక్ అయిన విషయం తెలియజేయాలి. మెసేజ్‌లకు రిప్లై ఇవ్వొద్దని సూచించాలి.
సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే.. ముందుగా పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా పెట్టుకోవడం ముఖ్యం. అలాగే లాగిన్ కోసం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. సోషల్ మీడియా యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. అకౌంట్ హ్యాక్ అయిందో లేదో గుర్తించేందుకు తరచూ పోస్ట్‌లు, మెసేజ్‌లను చెక్ చేస్తుండాలి.