Telugu Global
Science and Technology

మొబైల్స్‌లో ఉండే సెన్సర్ల గురించి తెలుసా?

మన ఫోన్‌లో ఉండే రకరకాల సెన్సర్ల ద్వారా మొబైల్‌లో చాలా పనులు ఆటోమేటిక్‌గా జరుగుతుంటాయి. ఇలాంటి సెన్సర్లు మన ఫోన్‌లో చాలానే ఉన్నాయి.

మొబైల్స్‌లో ఉండే సెన్సర్ల గురించి తెలుసా?
X

అప్పుడప్పుడు మన ఫోన్ మనకు తెలియకుండానే కొన్ని పనులు చేస్తుంటుంది. ఫోన్ చేతిలోకి తీసుకోగానే స్క్రీన్ ఆన్ అవడం. జేబులో పెట్టుకోగానే ఆఫ్ అవడం బయటకు వెళ్లగానే ఆటోమేటిక్‌గా బ్రైట్‌నెస్ పెరగడం లాంటివి. ఇదంతా ఎలా జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా?

మన ఫోన్‌లో ఉండే రకరకాల సెన్సర్ల ద్వారా మొబైల్‌లో చాలా పనులు ఆటోమేటిక్‌గా జరుగుతుంటాయి. ఇలాంటి సెన్సర్లు మన ఫోన్‌లో చాలానే ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందామా!

లైట్ సెన్సర్

ఈ సెన్సర్ ప్రతి స్మార్ట్ ఫోన్‌లో ఉంటుంది. బయట ఉన్న లైట్‌ని బట్టి ఫోన్‌లో స్క్రీన్ బ్రైట్‌నెస్‌ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. లైట్ తక్కువగా ఉన్నప్పుడు బ్రైట్‌నెస్ పెంచుతూ, ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గిస్తూ కళ్ళు దెబ్బతినకుండా కాపాడుతుంది.

ప్రాక్సిమిటి సెన్సర్

ఫోన్లలో ఎక్కువగా ఉపయోగించే సెన్సర్లలో ఇది ఒకటి. దాదాపుగా అన్ని ఫోన్లలో ఉండే ఈ సెన్సర్ ఫోన్‌లో ఫ్రంట్ కెమెరా పక్కనే ఉంటుంది. మనం వేరే పనుల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా స్క్రీన్ లైట్ ఆఫ్ అవడం. చేతిలోకి తీసుకోగానే మళ్లీ స్క్రీన్ ఆన్ అవ్వడం ఇలా మన కదలికలను బట్టి ఈ సెన్సర్ పని చేస్తుంది.

మాగ్నటోమీటర్ సెన్సర్

ఈ సెన్సర్ మాగ్నటిక్ ఫీల్డ్‌ని గుర్తిస్తుంది. ఇది నార్త్ పోల్‌ను గుర్తించి తద్వారా దిక్కులను కూడా సూచిస్తుంది. జీపిఎస్‌లో మ్యాప్‌లు సూచించడానికి ఉపయోగించే సెన్సర్ ఇదే.

బారోమీటర్ సెన్సర్

అన్ని స్మార్ట్ ఫోన్లలో వెదర్ అప్‌డేట్స్ వస్తూనే ఉంటాయి. కానీ, అవి ఆయా ప్రాంతాల్లోని వాతావరణ శాఖ వెదర్ రిపోర్ట్స్‌ని మన ముందుంచుతాయి. కానీ కొన్ని మొబైల్స్ లోనే ఉండే ఈ సెన్సర్ మాత్రం అదే స్వయంగా చుట్టుపక్కల వాతావరణాన్ని విశ్లేషించి కచ్చితమైన టెంపరేచర్‌ని చూపిస్తుంది.

ఫింగర్ ప్రింట్ సెన్సర్

ఇది అందరికీ తెలిసిందే. ఫింగర్ ప్రింట్స్‌ని స్కాన్ చేసి అన్‌లాక్ చేయడం కోసం ఈ సెన్సర్‌‌ని వాడతారు. అలాగే ఖరీదైన ఫోన్లలో ఫేస్ డిటెక్షన్ అనే మరో సెన్సర్ కూడా ఉంటుంది. ఇది త్రీడీ ఇమేజ్ డిటెక్టింగ్ టెక్నాలజీ ద్వారా ముఖాన్ని స్కాన్ చేసి గుర్తు పెట్టుకుంటుంది.

First Published:  22 Jun 2024 8:15 AM IST
Next Story