Telugu Global
Science and Technology

డిజిటల్ అరెస్ట్.. సరికొత్త సైబర్ క్రైమ్! ఎలా ఉంటుందంటే..

ఆన్‌లైన్‌లో రోజురోజుకీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. రకరకాల కొత్త ఐడియాలతో సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేస్తున్నారు. తాజాగా ‘డిజిటల్ అరెస్ట్’ అనే కొత్తరకమైన క్రైమ్‌తో ఆన్‌లైన్ ద్వారా డబ్బు దోచేస్తున్నారు.

డిజిటల్ అరెస్ట్.. సరికొత్త సైబర్ క్రైమ్! ఎలా ఉంటుందంటే..
X

ఆన్‌లైన్‌లో రోజురోజుకీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. రకరకాల కొత్త ఐడియాలతో సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేస్తున్నారు. తాజాగా ‘డిజిటల్ అరెస్ట్’ అనే కొత్తరకమైన క్రైమ్‌తో ఆన్‌లైన్ ద్వారా డబ్బు దోచేస్తున్నారు. ఇదెలా ఉంటుందంటే.

బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు దొంగిలించి డబ్బు కాజేయడం మనకు తెలిసిందే. అయితే డిజిటల్ అరెస్ట్ అలాంటిది కాదు, పోలీసులు, కస్టమ్ అధికారుల పేరుతో భయపెట్టి యూజర్ల నుంచి డబ్బు కాజేసే సరికొత్త టెక్నిక్ ఇది. డిజిటల్ అరెస్ట్ క్రైమ్ ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

డిజిటల్ అరెస్ట్‌లో భాగంగా ముందు నేరగాళ్లు కాల్ చేసి మీ పేరు మీద డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని లేదా ఇతర డిజిటల్ క్రైమ్‌లో మీ పేరు నమోదు అయిందని భయపెడతారు. వివరాలు తెలియజేయడం కోసం వీడియో కాల్ చేయాలని చెప్తారు. వీడియో కాల్ చేస్తే పోలీసులు లేదా అధికారుల వేషంలో నేరగాళ్లు ప్రత్యక్షమవుతారు. వెనుక ఆయా డిపార్ట్‌మెంట్ లోగోలు కూడా కనిపిస్తాయి. అదంతా నిజం అనుకుని భయపడితే ఇక అంతే సంగతి.

వీడియో కాల్‌లో నేరగాళ్లు విచారణ పేరుతో భయపెట్టాలని చూస్తారు. మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని, విచారణ పూర్తయ్యే వరకూ వీడియోలో నుంచి కదలడానికి వీల్లేదని చెప్తారు. అలా కొన్ని వివరాలు అడిగి చివరికి బ్యాంక్ డీటెయిల్స్ దగ్గరకు వస్తారు. వెరిఫికేషన్ కోసం లింక్ క్లిక్ చేయాలని లేదా ఓటీపీ చెప్పాలని అడుగుతారు. ఇలా భయపెట్టి విచారణ పేరుతో డబ్బు కాజేసి మాయమవుతారు. ఇదే డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే..

జాగ్రత్తలు ఇలా..

ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా సమాధానం చెప్పాలి. మీ వివరాలు సైబర్ క్రైమ్‌కు ఇస్తానని తిరిగి మీరే భయపెట్టాలి. మన చట్టాల్లో డిజిటల్‌ అరెస్ట్‌ అనేదే లేదన్న విషయం తెలుసుకోవాలి.

ఒకవేళ నిజంగా అధికారులే కాల్ చేశారన్న అనుమానం వస్తే వివరాలతో కూడిన నోటీసు పంపించమని అడగాలి. అవసరమైతే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి కలుస్తానని చెప్పాలి. బ్యాంక్ వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరితో షేర్ చేసుకోకుండా జాగ్రత్తపడాలి.

First Published:  20 Jun 2024 1:49 PM IST
Next Story