Telugu Global
Science and Technology

ఇంటర్నెట్‌ను ఎక్కువగా నమ్ముతున్నారా? ఇది తెలుసుకోండి!

ఇంటర్నెట్‌ను తప్ప మరెవరినీ నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుందట. దీన్నే ‘ఇంటర్నెట్ డిరైవ్‌డ్ ఇన్ఫర్మేషన్ అబ్ స్ట్రక్టివ్ సిండ్రోమ్(ఇడియట్‌ సిండ్రోమ్‌)’ అని అంటున్నారు.

ఇంటర్నెట్‌ను ఎక్కువగా నమ్ముతున్నారా? ఇది తెలుసుకోండి!
X

ఈ రోజుల్లో ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే గూగుల్ చేసేయడం అలవాటు చాలామందికి. అయితే ఈ అలవాటు మితిమీరితే ఒకరకమైన డిజార్డర్‌‌గా మారుతుందట. ఇంటర్నెట్‌ను తప్ప మరెవరినీ నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుందట. దీన్నే ‘ఇంటర్నెట్ డిరైవ్‌డ్ ఇన్ఫర్మేషన్ అబ్ స్ట్రక్టివ్ సిండ్రోమ్(ఇడియట్‌ సిండ్రోమ్‌)’ అని అంటున్నారు. ఇదెలా ఉంటుందంటే..

‘ఇడియట్ సిండ్రోమ్’ అనేది ఒకరకమైన మానసిక సమస్య. ఇది ఉన్నవాళ్లు ఇంటర్నెట్‌పైనే పూర్తిగా ఆధారపడతారు. డాక్టర్లు లేదా ఇతర నిపుణుల మాటలపై నమ్మకం ఉండదు. ఇంట్లో వాళ్ల మాటలు కూడా పట్టించుకోరు. చివరికి వ్యాధులకు కూడా ఇంటర్నెట్‌లో చూసి వాళ్లే సొంత వైద్యం చేసుకుంటారు. డాక్టర్లకు ఏమీ తెలీదన్నట్టుగా వాదిస్తారు.

ఇలా గుర్తించొచ్చు

మనుషులపై నమ్మకం లేకుండా కేవలం ఇంటర్నెట్‌ను మాత్రమే నమ్మడం ద్వారా రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ తరహా సిండ్రోమ్ ఉన్నవాళ్లు దేన్నీ నమ్మలేక రకరకాల ఆలోచనలతో సతమతమవుతుంటారు. అన్నింటినీ నెగెటివ్‌గా చూస్తారు. ఇంటర్నెట్‌లో చదివిందే నిజమని గుడ్డిగా నమ్ముతారు. ఇంటర్నెట్‌లో తగిన సమాచారం లభించకపోతే కంగారు పడిపోతుంటారు. క్రమంగా యాంగ్జైటీ, డిప్రెషన్‌లోకి వెళ్తారు. ఇలాంటి లక్షణాలను గుర్తిస్తే వెంటనే సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలి.

ఇలా బయటపడొచ్చు

ఇడియట్‌ సిండ్రోమ్‌ అనేది సీరియస్‌ మెంటల్ ఇష్యూ అని మానసిక నిపుణులు చెప్తున్నారు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఎక్కువగా వాడే టీనేజర్లలో ఈ తరహా సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. చిన్న వయసు నుంచే మొబైల్ అడిక్షన్‌ను తగ్గించడం ద్వారా ఇలాంటి సమస్యల బారిన పడుకుండా జాగ్రత్తపడొచ్చు. ఎవరి మాటలు వినకుండా ఇంటర్నెట్‌లో ఉన్నదే నిజమని వాదిస్తున్నట్టు గమనిస్తే అలాంటి వ్యక్తులను మొబైల్‌కు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా అనారోగ్యాలకు సంబంధించి డాక్టర్ల మాట వినకపోతుంటే వెంటనే జాగ్రత్తపడాలి.

First Published:  15 Jun 2024 4:59 AM GMT
Next Story