తేమ నుంచి నీటిని ఉత్పత్తి చేసే యూనిట్స్
ఈ యూనిట్లు రోజుకు రూ. 8,000 లీటర్ల తాగు నీటిని ఉత్పత్తి చేయగలుగుతాయని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడి

పర్యావరణహితమైన విధంగా కార్యకలాపాల నిర్వహణలో భాగంగా వాతావరణంలోని తేమ నుంచి తాగు నీరును ఉత్పత్తి చేసే అధునాతన సాంకేతికతను వినియోగంలోకి తెచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. వాతావరణంలోని తేమ నుంచి రోజుకు 8,000 లీటర్ల మేర వినియోగించుకోతగిన నీటిని ఉత్పత్తి చేసే సామర్థ్యం గల యూనిట్లను బ్యాంకు ఇన్‌స్టాల్ చేసింది. దీనితో బెంగళూరు, హైదరాబాద్, ముంబైలోని ఒక్కో ఆఫీసు చెన్నైలోని రెండు ఆఫీసులు చొప్పున మొత్తం అయిదు ఆఫీసుల్లోని 4,200 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనున్నది.
అట్మాస్ఫరిక్ వాటర్ జనరేటర్లుగా (ఏడబ్ల్యూజీ) వ్యవహరించే ఈ యూనిట్లు, వాతావరణంలోని తేమను 100 శాతం సూక్ష్మక్రిములరహితమైన, స్వచ్ఛమైన, తాజా తాగు నీటిగా మార్చే వినూత్నమైన సాంకేతికతను ఉపయోగిస్తాయి. సాంద్రీకరణ ప్రక్రియతో ఆవిరిని నీటి బిందువులుగా మార్చిన తర్వాత ఆ నీరు పలు దశల్లో శుద్ధి చేయబడుతుంది. ప్రక్రియ ఆఖర్లో కీలకమైన ఖనిజాలు జోడించబడతాయి. వివిధ ఉష్ణోగ్రతల్లో (18°C- 45°C), తేమ పరిస్థితుల్లో (25%- 100%) పని చేయగలిగే సామర్థ్యాలున్నందున ఈ ఏడబ్ల్యూజీలు ఏడాది పొడవునా నీటిని అందించగలుగుతాయి.
“పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తూ, పర్యావరణ అనుకూలమైన విధంగా వ్యాపార నిర్వహణకు ఐసీఐసీఐ బ్యాంకు కట్టుబడి ఉంది. పర్యావరణ, జీవావరణ సంరక్షణకు 4R (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రెస్పాన్సిబుల్ డిస్పోజల్ (reduce, reuse, recycle and responsible disposal)) సూత్రం ప్రాతిపదికగా మా వ్యూహం ఉంటుంది. ఈ భూమ్మీద ఉన్న అన్ని నదుల్లోకెల్లా అత్యధికంగా తాజా నీరు వాతావరణలోని తేమలో ఉంటుందని అంచనా. ఈ పునరుత్పాదక వనరును వినియోగంలోకి తెచ్చేందుకు మేము మా కార్యాలయాల్లో ఏడబ్ల్యూజీలను ఇన్‌స్టాల్ చేశాం. ఇవి ఆవిరిని, తాగు నీటిగా మారుస్తాయి. వాతావరణంలోని తేమను ఉపయోగించుకోవడం వల్ల ప్యాకేజ్డ్ వాటర్‌పై ఆధారపడటం తగ్గుతుంది” అని ఐసీఐసీఐ బ్యాంక్ గ్రూప్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌమేంద్ర మత్తగజసింగ్ తెలిపారు.
ఈఎస్‌జీ పాలసీ కింద పర్యవరణహిత కార్యక్రమాలను అమలు చేసేందుకు ఐసీఐసీఐ బ్యాంకు కట్టుబడి ఉంది. 2032 ఆర్థిక సంవత్సరం నాటికి స్కోప్ 1, స్కోప్ 2 కర్బన ఉద్గారాల ప్రమాణాలకు సంబంధించి తటస్థ స్థాయికి చేరుకోవాలని బ్యాంకు లక్ష్యంగా పెట్టుకున్నది. 2024 మార్చి 31 నాటికి బ్యాంకుకు చెందిన 4.95 మిలియన్ చ.అ. విస్తీర్ణంలోని 180 సైట్లకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) సర్టిఫికేషన్ ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ముంబైలో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని ఐసీఐసీఐ సర్వీస్ సెంటర్‌కు ‘నెట్ జీరో వేస్ట్’ సర్టిఫికెట్ లభించింది. కిందటి ఏడాదితో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని బ్యాంకు నాలుగు రెట్ల స్థాయిలో 75.73 మిలియన్ kWhకి బ్యాంకు పెంచుకుంది. అలాగే 2022 ఆర్థిక సంవత్సరం నుంచి 37 లక్షల పైచిలుకు మొక్కలను నాటింది. పాఠశాలలు, జలాశయాల్లో ఏటా 25.8 బిలియన్ లీటర్ల నీటిని హార్వెస్టింగ్ చేసే అవకాశాలు కల్పించింది.
*