Telugu Global
Science and Technology

భారత్‌లో స్టార్‌ లింక్‌ సేవలు ప్రారంభమయ్యేందుకు మార్గం సగమం!

దీనికి భారత్‌లో టెలికాం నిబంధనలకు స్టార్‌ లింక్‌ అంగీకారం తెలుపాల్సి ఉన్నది.

భారత్‌లో స్టార్‌ లింక్‌ సేవలు ప్రారంభమయ్యేందుకు మార్గం సగమం!
X

ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌ లింక్‌ సేవలు భారత్‌లో ప్రారంభమయ్యేందుకు మార్గం సగమం అయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెల్లడయ్యాయి.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలవడంతో దిగ్గజ కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌ లింక్‌ సేవలు భారత్‌లో మొదలుపెట్టడానికి అడుగులు మొదలుపెట్టినట్టు సమాచారం. ఇండియాలో బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు ప్రారంభించడానికి లైసెన్స్‌ పొందాలి. దీనికి భారత్‌లో టెలికాం నిబంధనలకు స్టార్‌ లింక్‌ అంగీకారం తెలుపాల్సి ఉన్నది. దేశంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించడానికి టెలికాం సంస్థ సేకరించే డేటాను భద్రతా నియమకాలకు లోబడి భారత్‌లోనే భద్రపరచాలి. అవసరమైన సమయంలో దర్యాప్తు సంస్థలు ఆ డేటాను పొందడానికి వీలు కల్పించాలి. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడానికి ఈ నియమాలు కచ్చితంగా పాటించాలి. వీటికి స్టార్‌ లింక్‌ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలి కమ్యునికేషన్‌ ఇటీవల జరిగిన సమావేశాల్లో తెలిపింది.

ఈ నేపథ్యంలో స్టార్‌ లింక్‌ సంస్థ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల లైసెన్స్‌ పొందడానికి అడుగులు పడినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ప్రభుత్వ నియమ నిబంధనలకు అంగీకారం తెలుపుతూ.. ఇప్పటివరకు ఎటువంటి ఒప్పంద పత్రాన్ని స్టార్‌లింక్‌ సమర్పించలేదు. ఇన్‌-స్సేస్‌కు అనుమతుల కోసం స్టార్‌లింక్‌ దరఖాస్తు చేస్తున్నది. ఈ ప్రక్రియ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తుది అనుమతులు ఇవ్వడానికి ఇన్‌-స్పేస్‌ ఛైర్మన్‌ గోయెంకా స్టార్‌ లింక్‌ నుంచి మరింత సమాచారం కోరినట్లు తెలుస్తోంది. భారత నిబంధనలకు స్టార్‌ లింక్‌ ఒప్పుకోవడంతో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ స్పెక్ట్రమ్‌ కేటాయింపు, వాటి ధరలను ఖరారు చేయడంపై వాటాదారులతో సంప్రదింపులు చేయడానికి కసరత్తు చేస్తున్నది. డిసెంబర్‌ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్నది. స్టార్‌ లింక్‌కు అన్ని అనుమతులు లభించి దేశీయంగా సేవలు ప్రారంభిస్తే దేశీయ టెలికాం కంపెనీలు తీవ్రమైన పోటీ ఎదుర్కొనే అవకాశం ఉన్నది.

స్టార్‌లింక్‌తో సహా ఎవరికైనా సరే స్పెక్ట్రం లైసెన్సు ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దానికి ఒక విధానం ఉన్నదని, దాన్ని పాటించిన వారికి సంతోషంగా లైసెన్స్‌ అప్పగిస్తామని వెల్లడించారు. నిబంధనలకు కట్టుబడి ఉంటే స్పెక్ట్రం లైసెన్స్‌ ఎవరికైనా ఇస్తామన్నారు.

First Published:  12 Nov 2024 10:54 AM IST
Next Story