Telugu Global
Science and Technology

పోయిన ఫోన్‌ను నిముషాల్లో పట్టేశాడు! టెక్నిక్ ఇదే!

టెక్‌ ఇన్‌ఫ్లుయెన్సర్ షారుక్‌.. గతంలో తాను మొబైల్ కోల్పోయిన సంగతి, దాన్ని తిరిగి రికవరీ చేసిన సంగతులను తాజాగా ఎక్స్ ద్వారా షేర్ చేసుకున్నాడు. షారుక్ తన భార్యతో కలిసి దిల్లీలోని జామా మసీదుకు ఇఫ్తార్‌ విందుకు వెళ్లినప్పుడు రెండు ఫోన్లు పోగొట్టుకున్నాడు.

పోయిన ఫోన్‌ను నిముషాల్లో పట్టేశాడు! టెక్నిక్ ఇదే!
X

ఎప్పుడైనా అనుకోని సందర్భాల్లో మొబైల్ పోతే చాలా కంగారు పడిపోతారు ఎవరైనా. పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడమో, వెళ్లి వెతకడమో చేస్తారు. అయితే టెక్ ఇన్ ఫ్లుయెన్సర్ షారుక్ మాత్రం అలా చేయలేదు. మొబైల్‌లో ఉండే సెట్టింగ్స్ సాయంతో తెలివిగా మొబైల్‌ను కనిపెట్టాడు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మొబైల్ పోయినప్పుడు దాన్ని కనిపెట్టేందుకు మొబైల్‌లో ముందుగానే కొన్ని సెట్టింగ్స్‌లో ఆన్‌లో ఉంచుకోవాలి. అలాగే వాటిని ఎలా ఉపయోగించాలో కూడా తెలిసి ఉండాలి. ఇలా తెలుసుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో మొబైల్‌ను ఈజీగా గుర్తించొచ్చు. పబ్లిక్ ప్లేస్‌లో ఎవరో మొబైల్ దొంగిలిస్తే.. అంతమందిలో అసలు దొంగని సింపుల్‌ ట్రిక్‌తో కనిపెట్టి రెండు ఫోన్లను పొందగలిగాడు షారుక్. అదెలాగంటే..

టెక్‌ ఇన్‌ఫ్లుయెన్సర్ షారుక్‌.. గతంలో తాను మొబైల్ కోల్పోయిన సంగతి, దాన్ని తిరిగి రికవరీ చేసిన సంగతులను తాజాగా ఎక్స్ ద్వారా షేర్ చేసుకున్నాడు. షారుక్ తన భార్యతో కలిసి దిల్లీలోని జామా మసీదుకు ఇఫ్తార్‌ విందుకు వెళ్లినప్పుడు రెండు ఫోన్లు పోగొట్టుకున్నాడు. ఐఫోన్‌ 13, షావోమి సివి2, రెడ్‌మీ కే50 అల్ట్రా. మూడు ఫోన్లనూ బ్యాగ్‌లో ఓ జిప్‌లో పెట్టాడట. కాసేపటి తర్వాత చూస్తే బ్యాగు తెరిచి ఉండి, అందులో ఐఫోన్‌, షావోమి ఫోన్లు మాయమయ్యాయట. చూసిన వెంటనే ‘దొంగా.. దొంగా.. ’అని అరిచాడట. అంతమందిలో అదెవరూ పట్టించుకోలేదు.. ఐఫోన్‌కు కాల్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వస్తుంది. షావోమీ ఫోన్‌ మాత్రం ఆన్‌లోనే ఉంది. దాన్ని స్విచాఫ్ చేయలేకపోవడానికి కారణం ఆ ఫోన్‌లో షట్‌డౌన్‌ కన్ఫర్మేషన్‌ ఫీచర్‌ని ఎనేబుల్‌ చేసుకోవడమే. ఈ ఫీచర్‌ ఆన్‌లో ఉన్నప్పుడు ఫోన్ స్విచాఫ్‌ చేయాలంటే పాస్‌వర్డ్‌ ఇవ్వాలి. దీంతో ఆ ఫోన్‌ ఆన్‌లోనే ఉంది. ఇప్పుడు వెంటనే తన దగ్గర ఉన్న మరో మొబైల్‌లో ‘ఫైండ్‌ మై డివైజ్‌ ’ ఓపెన్‌ చేసి.. గూగుల్ అకౌంట్ సాయంతో షావోమీ మొబైల్ లొకేషన్ తెలుసుకున్నాడు. అది మసీదు ప్రాంగణంలో చూపించింది. ఇప్పుడు ఫైండ్‌ మై డివైజ్‌ ఆప్షన్స్‌లో ట్యాప్‌ సౌండ్‌ క్లిక్‌ చేశాడు. దీంతో ఆ ఫోన్‌ బిగ్గరగా రింగ్ అవ్వడం మొదలైంది. దాన్ని అవతలి వ్యక్తి ఆపలేడు. కాసేపటి తర్వాత మొబైల్‌కు కాల్ చేస్తే అప్పుడు ఆ వ్యక్తి కాల్ ఎత్తి.. మసీదు గేట్‌ నంబర్‌ 2 దగ్గరకు వచ్చి మొబైల్ తీకోమని చెప్పాడు. అలా షారుక్ తన రెండు ఫోన్లను తిరిగి పొందాడు.

ఈ సంఘటనను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ముందుగా మొబైల్ సెట్టింగ్స్‌లో ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్లి అక్కడ షట్ డౌన్ కన్ఫర్మేషన్‌ను ఆన్ చేసుకోవాలి. అయితే ఇది అన్ని మొబైల్స్‌లో అందుబాటులో ఉండకపోవచ్చు. కొన్ని లేటెస్ట్ మొబైల్స్ యూఐలలో ఇది కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ఉన్నా లేకపొయినా మొబైల్‌లో ‘ఫైండ్ మై డివైజ్‌’ను ఆన్ చేసుకోవడం ద్వారా మొబైల్ పోయినప్పుడు మరో మొబైల్ ద్వారా ఆ మొబైల్‌ను లాక్ లేదా రింగ్ అయ్యేలా చేయొచ్చు. స్విచాఫ్ చేసినప్పుడు ఈ ఫీచర్ పనిచేయదు. కానీ, ఎప్పుడైతే అవతలి వ్యక్తి మొబైల్‌ను స్విచ్ ఆన్ చేస్తాడో.. అప్పుడు మొబైల్ లొకేషన్ కనిపెట్టేందుకు వీలుంటుంది.

First Published:  26 April 2024 7:15 AM IST
Next Story