Honor | భారత్ మార్కెట్‌లోకి రీ ఎంట్రీ.. ఇదీ అసలు హానర్ లక్ష్యం..?!
Honor | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ `హానర్ (Honor)` భారత్ మార్కెట్‌లోకి పునరాగమనం చేస్తామని ప్రకటించింది.
Honor | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ `హానర్ (Honor)` భారత్ మార్కెట్‌లోకి పునరాగమనం చేస్తామని ప్రకటించింది. భారత్‌లో స్మార్ట్ ఫోన్లను తయారుచేస్తామని కూడా హానర్ ఇండియా వైస్‌ప్రెసిడెంట్ నీల్‌షా కౌంటర్ పాయింట్ రీసెర్చ్‌తో మాట్లాడుతూ చెప్పారు. వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌లో స్మార్ట్ ఫోన్ల తయారీ విషయమై స్థానిక కంపెనీతో సంప్రదిస్తున్నట్లు తెలిపారు. భారత్ మార్కెట్ బడ్జెట్ ఫోన్లకు పరిమితం కావడంతో గతేడాదే స్మార్ట్ ఫోన్ల విక్రయాలు నిలిపేసింది. ఇదిలా ఉంటే వచ్చేనెల ఒకటో తేదీన బెర్లిన్ వేదికగా హానర్ మ్యాజిక్ వీ2 లైట్, మ్యాజిక్ వీ2 ఫోన్ల ఆవిష్కరణకు రంగం సిద్ధం చేస్తున్నది.
హువావే అనుబంధ సంస్థ `హానర్ టెక్నాలజీస్`.. 2020 వరకు భారత్ మార్కెట్‌పై ఏనాడూ తాము ఫోకస్ చేయలేదని నీల్‌షా తెలిపారు. తాము తిరిగి సంస్థ వ్యూహాన్ని పునః పరిశీలించుకున్నట్లు చెప్పారు. గురుగ్రామ్ కేంద్రంగా హానర్ టెక్ అనే సంస్థతో లైసెన్సింగ్ డీల్‌కు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ కంపెనీకి స్మార్ట్ ఫోన్ల తయారీకి అవసరమైన టెక్నాలజీ, హార్డ్ బదిలీ చేయడానికి కూడా అంగీకారం కుదిరినట్లు సమాచారం.
వచ్చేనెలలో మూడు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించడానికి ప్రణాళికలు రూపొందించింది హానర్. భారత్ మార్కెట్‌లో హానర్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల తయారీ, విక్రయం, సర్వీసింగ్ కోసం స్థానిక వాటాదారులతో కూడిన కంపెనీ చర్యలు చేపడుతున్నది. హానర్ ఇండియా సీఈఓ మాథవ్ సేథ్ స్పందిస్తూ.. `అన్ని స్మార్ట్ ఫోన్లు భారత్‌లోనే తయారు చేస్తాం` అని చెప్పారు.
భారత్ మార్కెట్లో చైనా బ్రాండ్ బాధ్యత ఎంత అన్నదే అతిపెద్ద సవాల్ అని మాధవ్ సేథ్ స్పష్టం చేశారు. పలు చైనా యాప్‌లను నిషేధించడంతోపాటు భారత్‌లో పెట్టుబడులపై నిశిత పరిశీలనలు, దర్యాప్తులు చేస్తుండటంతో చైనా సంస్థలు నిష్క్రమించడానికి సిద్ధమైన నేపథ్యంలో మాథవ్ సేథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
భారత్ మార్కెట్లో దాదాపు 20 శాతం వాటా గల శాంసంగ్ ఎలక్ట్రానిక్స్‌తోపాటు వివో, షియోమీ, రియల్‌మీలతో హానర్ పోటీ పడుతున్నది. భారత్ మార్కెట్‌లో 2024 నాటికి ఐదు శాతం వాటా సంపాదించడంతోపాటు రూ.10 వేల కోట్ల ఆదాయం పొందాలన్న లక్ష్యంతో హానర్ పని చేస్తున్నది.