Telugu Global
Science and Technology

పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ సురక్షితమే

పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ నుంచి సంకేతం వచ్చిందని మేరీలాండ్‌లోని జాన్‌ హాప్కిన్స్‌ అప్లైడ్‌ ఫిజిక్స్‌ లేబోరేటరి వెల్లడి

పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ సురక్షితమే
X

సూర్యుడి అన్వేషణ కోసం దానికి అత్యంత సమీపంలోకి వెళ్లిన పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ సురక్షితంగానే ఉన్నదని నాసా శుక్రవారం వెల్లడించింది. సూర్యుడి బాహ్య వాతావరణంగా పిలిచే కరోనా పరిశోధన కోసం శాస్త్రవేత్తలు దాన్ని పంపించారు. కాగా సూర్యుడికి అతి సమీపంలోకి వెళ్లిన తర్వాత తాత్కాలికంగా దాని నుంచి సంకేతాలు అందలేదని అధికారులు పేర్కొన్నారు. వాటి కోసం శుక్రవారం వరకు వేచి చూడాలని భావించారు. అయితే ఆ సంకేతాలు గురువారమే అందినట్లు పేర్కొన్నారు.

గురువారం రాత్రి పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ నుంచి సంకేతం వచ్చిందని మేరీలాండ్‌లోని జాన్‌ హాప్కిన్స్‌ అప్లైడ్‌ ఫిజిక్స్‌ లేబోరేటరి వెల్లడించిది. డిసెంబర్‌ 24న సౌర ఉపరితలానికి 6.1 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలోకి వెళ్లి, సూర్యుడికి అత్యంత దగ్గరగా చేరినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఏ వ్యోమ గామ సూర్యుడికి ఇంత దగ్గరగా వెళ్లలేదని పేర్కొన్నారు. ఈ పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ జనవరి 1న తన పరిశోధనలకు సంబంధించిన వివరణాత్మక టెలిమెట్రీ డేటాను పంపనున్నదని నాసా పేర్కొన్నది. ఈ పరిశోధనల వల్ల సూర్యుడి బాహ్య

వాతావరణంగా పిలిచే కరోనా ప్రాంతంలోని కణాలు మిలియన్ల డిగ్రీ వరకు ఎలా వేడెక్కుతాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవడానికి వీలవుతుందని తెలిపారు.నాసాతో పాటు పలు పరిశోధనల సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు పార్కర్‌ ప్రోబ్‌ను సంయుక్తంగా రూపొందించారు. నాసా తెలిపినవివరాల ప్రకారం.. పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ 1,800 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ (982 డిగ్రీల సెల్సియస్‌) వరకు ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. అత్యధికపరికరం మాత్రం కవచం బైట ఉంటాయి. అవి కరిగిపోకుండా టంగ్‌స్టన్‌, నియోబియం, మాలిబ్డినమ్‌, సఫైర్‌ వంటి పదార్థాలతో వాటిని తయారు చేశారు. కరోనా పొరపై ఏడేళ్లపాటు పరిశోధనలు జరపడమే ప్రాథమిక లక్ష్యంగా నాసా 2018లో పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ను ప్రయోగించింది. ఈ వ్యోమ నౌక 2021 ఏప్రిల్‌ 28న మొదటిసారి కరోనా పొరలోకి ప్రవేశించింది.

First Published:  27 Dec 2024 3:37 PM IST
Next Story