ఒప్పో నుంచి శాటిలైట్ నెట్‌వర్క్ ఫోన్! ఫీచర్లివే..
‘ఒప్పో ఫైండ్ ఎక్స్ 7 అల్ట్రా శాటిలైట్ ఎడిషన్’ మొబైల్.. 5.5జీ నెట్‌వర్క్ విత్ శాటిలైట్ కమ్యూనికేషన్ అనే ఫీచర్‌తో పనిచేస్తుంది.
మొబైల్ బ్రాండ్‌లు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ రోజుకో కొత్త రకం టెక్నాలజీలను పరిచయం చేస్తున్నాయి. తాజాగా ఒప్పో బ్రాండ్ 5జీ ని తలదన్నేలా ‘5.5జీ’ అనే కొత్త కనెక్టివిటీ ఫీచర్‌తో ఓ మొబైల్‌ను రెడీ చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకతలేంటంటే..
ఇప్పటివరకూ సెల్యులార్ నెట్‌వర్క్‌తోనే స్మార్ట్ ఫోన్లు పనిచేస్తూ వస్తున్నాయి. శాటిలైట్ నెట్‌వర్క్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ చైనాకు చెందిన ఒప్పో బ్రాండ్ ఒకడుగు ముందుకేసి శాటిలైట్ సిగ్నల్‌తో పనిచేసే మొబైల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘ఒప్పో ఫైండ్ ఎక్స్7 సిరీస్’ పేరుతో చైనాలో రిలీజైన ఈ మొబైల్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
‘ఒప్పో ఫైండ్ ఎక్స్ 7 అల్ట్రా శాటిలైట్ ఎడిషన్’ మొబైల్.. 5.5జీ నెట్‌వర్క్ విత్ శాటిలైట్ కమ్యూనికేషన్ అనే ఫీచర్‌తో పనిచేస్తుంది. అంటే ఇది డ్యుయల్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. 5జీ సెల్యులార్ నెట్‌వర్క్‌తో పాటు సిగ్నల్ అందుబాటులో లేనప్పుడు శాటిలైట్ సిగ్నల్ వాడుకుంటుంది. అయితే శాటిలైట్ సిగ్నల్స్ అన్ని దేశాల్లో ఇంకా అందుబాటులోకి రాలేదు. చైనాలో కొన్నిచోట్ల ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం చైనాలో ఈ మొబైల్‌కు మంచి డిమాండ్ ఉంది.
శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ సాయంతో ఇంటర్నెట్ మాత్రమే కాదు, కాల్స్, మెసేజ్‌లు కూడా చేసుకోవచ్చు. శాటిలైట్ ఫోన్ ద్వారా సెల్యూలార్ మొబైల్స్‌తో పాటు ల్యాండ్‌లైన్ నెంబర్లు, శాటిలైట్ ఫోన్లకు కూడా కమ్యూనికేట్ చేయొచ్చు. ముఖ్యంగా భద్రతా బలగాలకు ఈ ఫోన్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
ఇక మొబైల్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో అమర్చిన కెమరా సెటప్‌ను ఫోన్‌లోని మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో వెనుకవైపు నాలుగు 50 ఎంపీ కెమెరాలుంటాయి. రెండు టెలీఫోటో సెన్సర్‌లతోపాటు రెండు అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సర్‌లున్నాయి. ముందువైపు 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.
ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 4కె రిజల్యూషన్‌తో కూడిన 6.82-అంగుళాల అమోలెడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. యూఎఫ్‌ఎస్ 4.0 స్టోరేజీ సపోర్ట్‌తో వస్తుంది.
‘ఒప్పో ఫైండ్ ఎక్స్ 7 అల్ట్రా’ ధర 7,499 యువాన్లు(సుమారు రూ. 86,000) ఉంటుంది. 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఓషన్ బ్లూ, సెపియా బ్రౌన్, టైలర్డ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.