ఈ ఆన్‌లైన్ మోసాలను మీరు గమనించలేరని వాళ్లకు తెలుసు!
ఇ–కామర్స్ యాప్స్ లేదా ఇతర షాపింగ్ సైట్స్‌లో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు, బుకింగ్స్ చేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని విషయాల్లో మోసపోతుంటాం.
ఇ–కామర్స్ యాప్స్ లేదా ఇతర షాపింగ్ సైట్స్‌లో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు, బుకింగ్స్ చేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని విషయాల్లో మోసపోతుంటాం. ఇలా తెలియకుండా మోసగించే విధానాలను ‘డార్క్ ప్యాటర్న్ ట్రిక్స్’ అంటుంటారు. రీసెంట్‌గానే ఈ తరహా మోసాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం కొన్ని విధానాలను నిషేధించింది.
ఎలాగైనా వస్తువుని అంటగట్టాలనే ఉద్దేశంతో డార్క్ ప్యాటర్న్ మోసాలను ప్లాన్ చేస్తుంటాయి షాపింగ్ సైట్లు. ఈ తరహా స్కామ్స్‌ను గుర్తించడం చాలా కష్టం. అసలు ఇవెలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
బాస్కెట్ స్నీకింగ్
షాపింగ్ లేదా బుకింగ్స్ వంటివి చేసేటప్పుడు పేమెంట్ స్టెప్‌కు వచ్చిన తర్వాత చివర్లో కొన్ని అదనపు పేమెంట్స్ వచ్చి చేరుతుంటాయి. ఎన్జీవో డొనేషన్ కోసమని లేదా ఉచిత క్యాన్సిలేషన్ కోసం అదనపు ఛార్జీలని.. ఇలా కస్టమర్లను అడగకుండానే బిల్‌లో అంటగట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఉదాహరణకు సినిమా టికెట్స్ బుకింగ్స్ చేసే ఓ యాప్‌లో పేమెంట్ టైంలో ఛారిటీ కోసమని రెండు రూపాయలు ఆటోమెటిక్‌గా యాడ్ అవ్వడం మనం గమనించొచ్చు.
షేమింగ్
కొన్ని సంస్థలు ఏకంగా కస్టమర్లను ఆత్మన్యూనతా భావంలోకి నెట్టేస్తుంటాయి. ఉదాహరణకు నెట్‌లో ఏదో సెర్చ్ చేస్తుంటే సదరు సైట్‌లో ఇన్సూరెన్స్ తీసుకోమని యాడ్ వస్తుంది. కింద ‘యస్ ఆర్ నో’ ఆప్షన్స్ ఉంటాయి. ‘నో’ పైన క్లిక్ చేస్తే ‘మీ ఫ్యామిలీని రిస్క్‌లో పెట్టడం మీకు ఓకేనా?’ ‘యస్ ఆర్ నో..’ ‘మీరు మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు..’ ‘యస్ ఆర్ నో’ అని కనిపిస్తుంది. ‘నో’ పైన క్లిక్ చేయడానికి ఎవరికీ మనసొప్పదు. ఒకవేళ ‘యస్’ క్లిక్ చేస్తే.. ‘అయితే మరి ఇన్సూరెన్స్ తీసుకోండి’ అని మళ్లీ విండో ఓపెన్ అవుతుంది. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఫ్రీ ట్రయల్ సబ్‌స్క్రిప్షన్
ఏదైనా సర్వీస్‌కు సబ్ స్క్రిప్షన్ తీసుకోవడం కోసం ఫ్రీ ట్రయల్స్ ఆఫర్స్ చేస్తుంటాయి సంస్థలు. దానికోసం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎలాగూ మనీ కట్ అవ్వదు కదా అని డీటెయిల్స్ ఇస్తుంటాం. కానీ, కొన్ని సంస్థలు కార్డు వివరాలను మోసాల కోసం వాడుకుంటున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. కాబట్టి పేరున్న సంస్థల సబ్‌స్క్రిప్షన్ విషయంలోనే కార్డు వివరాలు ఎంటర్ చేయాలి.
కలర్ హైలెట్
కొన్ని వెబ్‌సైట్స్ ఓపెన్ చేసినప్పడు నోటిఫికేషన్స్‌ను ‘ఎలో’ చేయమని పైన పాప్‌అప్ వస్తుంది. అయితే సాధారణంగా ఈ పాప్‌అప్‌లో ‘ఎలో’ బటన్ ఎడమ వైపు, ‘డోంట్ఎలో’ బటన్ కుడి వైపున ఉంటుంది. ప్రతీసారి ‘డోంట్ ఎలో’నే నొక్కుతుంటారు. కానీ, యూజర్లను మాయ చేస్తూ అప్పుడప్పుడు బటన్ ప్లేస్‌ను రివర్స్ చేస్తారు. అలాగే ‘ఎలో’ బటన్‌ను కుడి వైపుకి మార్చి, రంగు హైలైట్ చేసి దాన్ని నొక్కేలా ట్రిక్ చేస్తారు. అలాగే క్రెడిట్ కార్డు పేమెంట్స్ చేసేటప్పుడు కూడా చివర్లో ‘డన్’ బటన్‌ను హైలైట్ చేయకుండా ‘ఎనేబుల్ ఆటో పే’ బటన్‌ను హైలైట్ చేస్తారు. యూజర్లు గమనించకుండా వాటిని క్లిక్ చేయాలన్నది వారి ప్లాన్.
డ్రిప్ ప్రైజింగ్
మామూలుగా ఆన్‌లైన్ షాపింగ్‌లో ప్రొడక్ట్‌ను కొనుగోలు చేయడానికి మూడు నిముషాలకు మించి టైం పట్టదు. కానీ, ఫ్లైట్ టికెట్స్ లేదా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేటప్పుడు పేమెంట్ పూర్తి చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. దీన్ని ఆసరా చేసుకుని సంస్థలు ‘డ్రిప్ ప్రైజింగ్’ అనే మోసాన్ని అమలుచేస్తాయి. వివరాలన్నీ ఎంటర్ చేసి పేమెంట్‌లో చివరి స్టెప్‌కు వచ్చిన తర్వాత రేటు పెరిగిందని చూపిస్తుంది. యూజర్లు మళ్లీ ప్రాసెస్ అంతా పూర్తి చేసే ఓపిక లేక పెరిగిన రేటును భరిస్తూ పేమెంట్ చేస్తారు. ఇదీ ఓ రకమైన మోసమే.
కౌంట్‌డౌన్ టైమర్
వస్తువు ధర తగ్గినట్టు చూపిస్తూ.. త్వరగా కొనకపోతే ధర పెరుగుతుందని కౌంట్‌డౌన్ టైమర్లు పెడుతుంటారు. ఈ తరహా మోసాలను ‘ఫాల్స్ అర్జెన్సీ’ అంటారు. ఇప్పుడు కొనకపోతే ‘ఇక ప్రొడక్ట్ దొరకదు’ లేదా ‘ధర పెరిగిపోతుంది’ అనే భావనను క్రియేట్ చేయడమన్న మాట.
ఇక వీటితోపాటు ఆన్‌లైన్‌లో ఏదైనా టూల్స్ వాడాలనుకున్నప్పుడు పని అంతా పూర్తయిన తర్వాత ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోమని లేదా యాప్ ఇన్‌స్టాల్ చేసుకోమని అడగడాన్ని ‘న్యాగింగ్ ట్రాప్’ అంటారు. అలాగే ప్రొడక్ట్ షాపింగ్‌లో చివరికి వచ్చే సరికి ప్రొడక్ట్ అందుబాటులో లేదని మరో ప్రొడక్ట్స సజెస్ట్ చేయడం, యూజర్లను అడగకుండా యాడ్ ఆన్ ప్రొడక్ట్స్‌ను కార్ట్‌లో యాడ్ చేయడం వంటి ట్రిక్స్ కూడా డార్క్ ప్యాటర్న్ మోసాల కిందకే వస్తాయి.