Mobile phones | దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ విలువ ఎంత పెరిగిందో తెలుసా.. ?
Mobile phones | గత పదేండ్లలో స్మార్ట్ ఫోన్ల తయారీ 21 రెట్లు పెరిగింది. ఆ స్మార్ట్ ఫోన్ల విలువ రూ.4.1 లక్షల కోట్లని ఇండియా సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపింది.
Mobile phones | ప్రస్తుతం మొబైల్ ఫోన్.. అందునా స్మార్ట్ ఫోన్ ‘హస్తభూషణం’. ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అవసరం. రోజురోజుకు స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగిపోవడంతో వాటి తయారీ కూడా పెరుగుతున్నది. గత పదేండ్లలో స్మార్ట్ ఫోన్ల తయారీ 21 రెట్లు పెరిగింది. ఆ స్మార్ట్ ఫోన్ల విలువ రూ.4.1 లక్షల కోట్లని ఇండియా సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపింది. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా దేశీయంగా స్మార్ట్ ఫోన్ల తయారీకి ‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సియేటివ్ (పీఎల్ఐ)’ స్కీమ్ తేవడంతో గ్లోబల్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు ఆపిల్, శాంసంగ్, వివో, షియోమీ తదితర సంస్థలు దేశీయంగా స్మార్ట్ ఫోన్లు తయారు చేస్తున్నాయి.
పీఎల్ఐ స్కీమ్ ఫలితంగా దేశీయ అవసరాల్లో 97 శాతం స్మార్ట్ ఫోన్లు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 30 శాతం స్మార్ట్ ఫోన్లను విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఇండియా సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ తెలిపింది.
2014-15లో స్మార్ట్ ఫోన్లు, మొబైల్ ఫోన్ల తయారీ విలువ రూ.18,900 కోట్లు ఉంటే, 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.4.10 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అంటే 2000 శాతం వృద్ధి నమోదవుతుంది. 2014-15లో విదేశాలకు రూ.1,556 కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఎగుమతి జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది రూ.1.20 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం. గత దశాబ్ద కాలంలో ఎగుమతుల్లో 7500 శాతం వృద్ధి సాధించినట్లు అవుతుంది అని ఐసీఈఏ తెలిపింది.
భారత్ నుంచి విదేశాలకు స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో ఆపిల్, శాంసంగ్ వంటి సంస్థలు దేశీయంగా స్మార్ట్ ఫోన్లు తయారు చేయడమేనని ఐసీఈఏ వివరించింది. ఈ సంస్థలు తయారు చేసిన స్మార్ట్ ఫోన్లలో మెజారిటీ బ్రిటన్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, ఇటలీ, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, సౌత్ అమెరికా మార్కెట్లకు భారీగా ఎగుమతి చేశాయి. మొబైల్ ఫోన్ల ఎగుమతిలో భారత్‌కు ఐదో స్థానం లభించింది.
ఐటీ, హార్డ్ వేర్ రంగాల్లో అవసరమైన భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీతో ఎలక్ట్రానిక్స్ వస్తువులకు పోటీ ఇవ్వగల కేంద్రంగా బారత్ నిలుస్తుంది. పీఎల్ఐ స్కీమ్ వల్ల విక్రయాలు మూడు నుంచి ఐదు శాతం పెరుగుతాయి. పీఎల్ఐ స్కీమ్ అమల్లోకి తేవడంతో ఫాక్స్‌కాన్, పెగట్రాన్, రైజింగ్ స్టార్, విస్ట్రన్ వంటి సంస్థలు భారత్‌లో తయారీ యూనిట్లు ఏర్పాటు చేశాయి. మరోవైపు, నోయిడాలో శాంసంగ్‌కు సొంతంగా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేసింది.