Reliance Jio-Bharti Airtel | శాటిలైట్ ఇంటర్నెట్‌లో జియోదే ఆధిపత్యమా.. ? భారతీ ఎయిర్‌టెల్‌కు జియో ఎగ్జిక్యూటివ్ వార్నింగ్‌ల అంతర్థారం ఇదేనా?!
Reliance Jio-Bharti Airtel | ఇంటర్నెల్, బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ప్రత్యేకించి శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో పోటీ మొదలైందా.. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ హోరాహోరీ తలపడబోతున్నాయా?.. అంటే అవుననే సమాధానం వస్తోంది.
Reliance Jio-Bharti Airtel | ఇంటర్నెల్, బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ప్రత్యేకించి శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో పోటీ మొదలైందా.. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ హోరాహోరీ తలపడబోతున్నాయా?.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంటర్నెట్ వసతి లేని మారుమూల ప్రాంతాలకు వేగంగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చేదే శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్. రిలయన్స్ జియో గత శుక్రవారం.. జియో స్పేస్ ఫైబర్ సర్వీస్ ప్రారంభించింది. జియో ప్రారంభించిన జియో స్పేస్ ఫైబర్ సర్వీస్ ఒక జీబీపీఎస్ బ్రాడ్‌బాండ్ కనెక్టివిటీ అందిస్తుంది.
రిలయన్స్ జియోకు ముందే భారతీయులకు శాటిలైట్ బ్రాడ్‌బాండ్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వన్ వెబ్‌తో జత కట్టింది భారతీ ఎయిర్‌టెల్. త్వరలో తమ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు యూజర్లకు అందుబాటులోకి తెస్తామని భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారతీఎయిర్‌టెల్ వన్‌వెబ్‌కు రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ హెచ్చరిక జారీ చేశారు. మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు అని సుతిమెత్తగా హెచ్చరించారు. తామూ భారతీ ఎయిర్‌టెల్ వన్ వెబ్ సేవలను తక్కువ అంచనా వేయబోమని కూడా వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్‌లో తమ పోటీదారులు తమతో సమానంగా సేవలు అందించలేరని పేర్కొన్నారు.
మేం మా ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయం. ఆయన (సునీల్ మిట్టల్) కూడా ఆ పని చేయరని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా మాథ్యూ ఊమెన్ పేర్కొన్నారు. భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ మాట్లాడుతూ ఎలన్‌మస్క్ సారధ్యంలోని స్టార్‌లింక్, అమెజాన్ మాత్రమే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించేందుకు భారతీ ఎయిర్‌టెల్-వన్‌వెబ్‌తో పోటీ పడతాయి అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ చేసిన వ్యాఖ్యకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇప్పటి వరకూ రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ మధ్య టెలికం రంగంలో కొనసాగిన పోటీ.. రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ హెచ్చరికలతో రెండు సంస్థల మధ్య స్పేస్ బ్రాడ్‌బాండ్ సేవల్లో ఆధిపత్యంపై పోటీ మొదలైందని భావిస్తున్నారు. వన్‌వెబ్‌లో భారతీ ఎయిర్‌టెల్‌కు గణనీయ వాటా ఉంది. భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎలన్‌మస్క్ సారధ్యంలోని స్టార్ లింక్, అమెజాన్ ప్రాజెక్ట్ కూపియర్ సంస్థల నుంచి ఇటు రిలయన్స్ జియో, అటు భారతీ ఎయిర్‌టెల్‌లకు గట్టి పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్స్ మార్కెట్ ఇంకా శైశవదశలోనే ఉంది. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు వైర్‌లెస్ ఇంటర్నెట్ సేవలు అందించడంలో కీలకంగా కానున్నది.
2025 నాటికి అంతరిక్ష రంగంలో సేవల ద్వారా భారత్‌కు 1300 కోట్ల డాలర్ల ఆదాయం వస్తుందని ఈవై-ఐఎస్‌పీఏ నివేదిక పేర్కొంది. ప్రతియేటా ఆరు శాతం వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేసింది.
స్టార్‌లింక్ (ఎలన్‌మస్క్) ఇక్కడికి రావచ్చు. అమెరికాలో స్టార్‌లింక్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి. భారత్‌లోనూ వారి బిజినెస్ మోడల్ ఎంతో వారే అర్థం చేసుకోవాలి అని మాథ్యూ ఊమెన్ పేర్కొన్నారు. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించడానికి రిలయన్స్ జియో.. లగ్జెంబర్గ్ ఆధారిత శాటిలైట్ ప్రొవైడర్ ఎస్ఈఎస్ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. తమ జాయింట్ వెంచర్‌కు స్పెక్ట్రం కేటాయించిన కొన్ని వారాల్లో స్పేస్ బ్రాడ్ బాండ్ సేవలు ప్రారంభిస్తామని రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ పేర్కొన్నారు. భారత్‌లో నాన్-జియో స్టేషనరీ శాటిలైట్ ప్రొవైడర్ (ఎన్‌జీఎస్ఓ) సేవలు గల సంస్థ జియో ఒక్కటేనని చెప్పారు. గిగాబైట్ సామర్థ్యం గల ఎన్‌జీఎస్ఓ సేవలను సమీప భవిష్యత్‌లో ఇతర సంస్థలు ఢీకొట్టలేవని ఆయన తేల్చేశారు.
దేశంలోని అన్ని ప్రాంతాలకు శాటిలైట్ బ్రాడ్‌బాండ్ సేవలు అందించేందుకు వన్‌వెబ్ సిద్ధంగా ఉందని ఇటీవలే సునీల్ మిట్టల్ వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ హెచ్చరికలు జారీ చేయడం ఆసక్తికర పరిణామం. ఇతర సంస్థలతో పోటీగా సేవలందిస్తామని మాథ్యూ ఊమెన్ చెప్పారు.