ఇంక సూర్యుడిపైనే గురి
సెప్టెంబర్ మొదటి వారంలో PSLV-C57 రాకెట్ ద్వారా ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది. సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే దీని లక్ష్యం.
అంతరిక్ష పరిశోధనలలో మరో ముందడుగుకు సిద్ధమవుతోంది ఇస్రో. చంద్రయాన్-3ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత రెట్టించిన ఉత్సాహంతో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఈ సారి సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన తొలి మిషన్ ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే దీని లక్ష్యం. సెప్టెంబర్ మొదటి వారంలో PSLV-C57 రాకెట్ ద్వారా ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఈ సంవత్సరంలో ఆరు ప్రయోగాలను విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఇటీవలే చంద్రుడిపై గుట్టును తెలుసుకునేందుకు చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ నెల 23న చంద్రయాన్-3 ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగనుంది. ఇక ఇప్పుడు ఇస్రో తొలిసారి సూర్యుడిపై ప్రయోగాలు చేసేందుకు ఆదిత్య - ఎల్1 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఆదిత్య - ఎల్1 ఉపగ్రహాన్ని బెంగళూరులోని శాటిలైట్ సెంటర్‌లో తయారు చేయగా అక్కడి నుంచి సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌కు భారీ భద్రత మధ్య తరలించారు. 1500 కిలోల బరువున్న శాటిలైట్ ఇది.
ఈ ప్రయోగంలో భాగంగా సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేయనున్నారు. సౌర తుపాన్ల సమయంలో జరిగే మార్పులపై అధ్యయనం చేయనున్నారు. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది. ఇందులో 7 పేలోడ్‌లు ఉంటాయి. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్‌లు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి వెలుపలి పొరలు, సౌరశక్తి కణాలు, సూర్యుడి అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించనున్నాయి. ఆదిత్య-ఎల్1లోని నాలుగు పేలోడ్‌లు నేరుగా సూర్యుడిని వీక్షిస్తాయి. మిగిలిన మూడు పేలోడ్‌లు ఎల్1 వద్ద కణాలు, క్షేత్రాల అధ్యయనాలు నిర్వహిస్తాయి.