ఇకపై ఫోన్‌లోనే టీవీ చూడొచ్చు
ఫోన్‌లో టీవీ ప్రోగ్రామ్స్ చూడాలంటే డిస్నీ హాట్‌స్టార్ లేదా సన్ నెక్స్ట్ లాంటి యాప్స్‌కు సబ్ స్క్రిప్షన్ ఉండాలి.
ఫోన్‌లో టీవీ ప్రోగ్రామ్స్ చూడాలంటే డిస్నీ హాట్‌స్టార్ లేదా సన్ నెక్స్ట్ లాంటి యాప్స్‌కు సబ్ స్క్రిప్షన్ ఉండాలి. అందులో కూడా కొన్ని ఛానెల్స్ మాత్రమే వస్తాయి. అలా కాకుండా అన్ని ఛానెల్స్ చూడాలంటే మాత్రం ఇంట్లో టీవీ, దానికో డీటీహెచ్ లేదా కేబుల్ కనెక్షన్ ఉండాలి. అయితే ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా నేరుగా మొబైల్‌లోనే టీవీ చూసేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది.
రీసెంట్‌గా జరిగిన బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ సొసైటీ ఎక్స్‌పోలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ శాఖ సెక్రటరీ అపూర్వ చంద్ర కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ఈ ఏడాది ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల వేలంతో పాటు కొన్ని దేశీయ ఓటీటీ ఫ్లాట్‌ఫారమ్‌లను ప్రారంభించడం, మొబైల్స్‌లోనే టీవీ ప్రోగ్రామ్స్ వచ్చేలా కొన్ని ట్రయల్స్ నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. అలాగే ఎఫ్‌ఎం రేడియోను టైర్ 2, టైర్ 3 నగరాలకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు.
మనదేశంలో పెద్ద సంఖ్యలో ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు ఉన్నప్పటికీ అందులో 60 శాతం మాత్రమే సేవలు అందిస్తున్నాయని, అలాగే దేశంలోని అన్ని సరిహద్దు ప్రాంతాలకు ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ సేవలను అందిచడం కోసం మౌలిక సదుపాయాలు, నెట్‌వర్క్ డెవలప్‌మెంట్ స్కీమ్ కోసం ప్రభుత్వం నాలుగేండ్ల కాలంలో రూ. 2,500 కోట్లు కేటాయించిందనీ చెప్పారు. దీంతోపాటు ఐఐటీ-కాన్పూర్, సాంఖ్య ల్యాబ్‌లు కలిసి టెలివిజన్ సిగ్నల్స్‌ను నేరుగా మొబైల్ ఫోన్స్‌లో ప్రసారం చేసేలా కొత్త ట్రాన్స్‌మిటర్‌లను తీసుకురానున్నట్టు ఆయన చెప్పారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ సాయంతో నేరుగా మొబైల్స్‌లోకి టీవీ సిగ్నల్స్‌ను పంపొచ్చు. అయితే దీనికోసం మొబైల్ ఫోన్ యూజర్లు తమ మొబైల్‌కు ప్రత్యేక డాంగిల్‌ను లింక్ చేసుకోవాలి . అలాకాకుండా టీవీ సిగ్నల్స్ కోసం ఫోన్‌లలో ప్రత్యేక చిప్‌ను ఇన్‌స్టాల్ చేసేలా మొబైల్ కంపెనీ వాళ్లను ప్రోత్సహించగలిగితే.. డాంగిల్ లేకుండానే మొబైల్‌లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ చూడొచ్చు.