2025లో నాలుగు గ్రహణాలు
భారత్ లో కనిపించే గ్రహణం ఒక్కటే
మరో నాలుగు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం.. 2025కి ఘనంగా స్వాగతం చెప్పేందుకు చిన్నాపెద్దలంతా సిద్ధమవుతున్నారు. 2025 సంవత్సరానికి సంబంధించిన వార్తలు, విశేషాలు ఏమిటా అని ఆరా తీస్తున్నారు కూడా. 2025లో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. వాటిలో రెండు సూర్య గ్రహణాలు కాగా మరో రెండు చంద్రగ్రహణాలు అని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జీవాజీ అంతరిక్ష అధ్యయన కేంద్రం వెల్లడించింది. మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం పగటిపూట ఈ గ్రహణం సంభంవించనుండటంతో మన దేశంలో ఇది కనిపించదు. అదే నెల 29న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. అది కూడా ఇండియాలో కనిపించబోదు. సెప్టెంబర్ ఏడు, ఎనిమిది తేదీల మధ్య అర్ధరాత్రి పూట ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని భారత్ లో వీక్షించొచ్చు. అదే నెల 21, 22 తేదీల మధ్య సంభవించే పాక్షిక సూర్యగ్రహణం కూడా భారత్‌లో కనిపించదు. అంటే సెప్టెంబర్ 7, 8 తేదీల మధ్య ఏర్పడే చంద్రగ్రహణం ఒక్కటే భారతీయులు వీక్షించే అవకాశముంది.