Telugu Global
Science and Technology

కోట్ల నుంచి వేలకి పడిపోతున్న ఫేస్‌బుక్ ఫాలోవర్లు.. జుకర్‌కూ తప్పని తిప్పలు

జుకర్‌బర్గ్‌కు ఉన్న అఫిషియల్ అకౌంట్‌కు దాదాపు 11.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ, అనూహ్యంగా ఈ సంఖ్య 10 వేలకు పడిపోయింది.

కోట్ల నుంచి వేలకి పడిపోతున్న ఫేస్‌బుక్ ఫాలోవర్లు.. జుకర్‌కూ తప్పని తిప్పలు
X

సోషల్ మీడియా దిగ్గజంలో అకౌంట్లు కలిగిన వారికి గత రెండు రోజులుగా ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పడిపోతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు చాలా మందికి ఫేస్‌బుక్ అకౌంట్లు ఉన్నాయి. వీటికి ఫ్రెండ్స్ మాత్రమే కాకుండా ఫాలోవర్లు కూడా భారీగా ఉంటారు. కాగా, తమ ఖాతాలను ఫాలో చేసే వారి సంఖ్య అనూహ్యంగా పడిపోయిందని ఫేస్‌బుక్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇతర సామాజిక వేదికల్లో స్క్రీన్ షాట్లు తీసి మరీ తమ ఫాలోవర్ల సంఖ్య ఎంత భారీగా పడిపోయిందో వివరిస్తున్నారు. చివరికి మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఖాతాకు కూడా భారీగా ఫాలోవర్ల సంఖ్య పడిపోవడం గమనార్హం.

జుకర్‌బర్గ్‌కు ఉన్న అఫిషియల్ అకౌంట్‌కు దాదాపు 11.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ, అనూహ్యంగా ఈ సంఖ్య 10 వేలకు పడిపోయింది. ప్రస్తుతం ఆయన అకౌంట్‌ను 9,995 మంది ఫాలో అవుతున్నట్లు చూపిస్తున్నారు. ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా తనకు 9 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా.. ఇప్పుడు 9 వేలకు చేరుకున్నారని ట్వీట్ చేశారు.ఫేస్‌బుక్‌లో సునామీ వచ్చిందని.. నిమిషాల వ్యవధిలో ఫాలోవర్లను తుడిచిపెట్టేసిందని యూజర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక్కసారిగా ఫాలోవర్లను కోల్పోవడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు.

ఫాలోవర్లు తగ్గిపోవడంపై మెటా అధికార ప్రతినిధి స్పందించారు. చాలా మంది ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌లో ఫాలోవర్లు తగ్గిపోతున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఈ అసౌకర్యానికి క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ బగ్‌ను రెక్టిఫై చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాము. త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని భావిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే, బగ్ ఫిక్స్ చేసిన తర్వాత మళ్లీ పాత ఫాలోవర్లు వస్తారా? లేదా అనే విషయం తెలియజేయలేదు. అంతే కాకుండా అసలు ఎందుకు ఈ సమస్య ఏర్పడిందో కూడా వివరించలేదు. కాగా, జుకర్‌బర్గ్ అకౌంట్ మాత్రం తిరిగి యధాతథ స్థితికి చేరుకున్నది. ఆయన గత ఫాలోవర్లు తిరిగి వచ్చేశారు.

First Published:  12 Oct 2022 4:28 PM IST
Next Story