Telugu Global
Science and Technology

చంద్ర‌యాన్‌-3.. ఒక‌రోజు ఆల‌స్యంగా..

జూలై 14న చంద్ర‌యాన్‌-3 రాకెట్‌ను ప్ర‌యోగించ‌నున్న‌ట్టు తెలిపింది. ఇది చంద్రుడిపై రోవ‌ర్‌ను దించేందుకు భార‌త్ చేస్తున్న మూడో ప్ర‌య‌త్నం కావ‌డం గ‌మ‌నార్హం.

చంద్ర‌యాన్‌-3.. ఒక‌రోజు ఆల‌స్యంగా..
X

ఈనెల 13న చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టనున్నట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గ‌తంలో వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ ప్ర‌యోగం ఒక‌రోజు ఆల‌స్యం కానుంది. ఈ విష‌యాన్ని ఇస్రో గురువారం ట్విట్టర్‌లో వెల్ల‌డించింది. జూలై 14న చంద్ర‌యాన్‌-3 రాకెట్‌ను ప్ర‌యోగించ‌నున్న‌ట్టు తెలిపింది. ఇది చంద్రుడిపై రోవ‌ర్‌ను దించేందుకు భార‌త్ చేస్తున్న మూడో ప్ర‌య‌త్నం కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ ప్ర‌యోగంలో భాగంగా ఎల్వీఎం-3పీ4 రాకెట్‌తో చంద్రయాన్-3 అంతరిక్ష నౌకను అనుసంధానించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారమే పూర్తిచేశారు. ఈ ఉపగ్రహం సుమారు 3,84,000 కిలోమీట‌ర్లు ప్రయాణించి చంద్రుని నుంచి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేరుకుంటుంది. తర్వాత జాబిల్లి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో అది ల్యాండ్ అవుతుందని ఇస్రో తెలిపింది.

ఇప్పటివరకు ఎవరూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఇస్రో 2019లో చంద్రయాన్-2 మిషన్‌ చేపట్టింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ఆర్బిటర్ సాఫ్ట్ ల్యాండింగ్ విఫలమైనప్పటికీ.. చంద్రుని చుట్టూ ప్రస్తుతం విజయవంతంగా పరిభ్రమిస్తోంది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తమ వాహకనౌకలను ల్యాండ్ చేయగలిగాయి. ఈ మైలురాయిని సాధించిన నాలుగో దేశంగా అవతరించాలని భారత్ ప్రయత్నిస్తోంది.

First Published:  7 July 2023 1:23 AM GMT
Next Story