మార్కెట్‌లోకి బజాజ్ కొత్త చేతక్ ఈవీ
సింగిల్ ఛార్జ్‌తో 153 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపిన కంపెనీ
ఎలక్ట్రిక్ వెహికిల్ రంగంలో చేతక్ ద్వారా తనకంటూ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బజాజ్ ఆటో తాజాగా మరో స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. చేతక్ 35 సిరీస్‌లో 3501, 3502, పేరిట రెండు వెర్షన్లను తీసుకొచ్చింది. 3501 అనేది ప్రీమియం మోడల్. దీని ధర రూ. 1.27 లక్షలు (ఎక్స్‌షోరూమ్, బెంగళూరు) కాగా.. 3502 ధరను రూ. 1.20 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇదే సిరిస్‌లో 3503 మోడల్‌ను త్వరలో తీసుకురానున్నారు.
పాత చేతక్ ఈవీ మాదిరిగానే అదే క్లాసిక్ లుక్‌తో కొత్త మోడళ్లను బజాజ్ తీసుకొచ్చింది. ఇందులో 3.5kWh బ్యాటరీ, 4 kW మోటార్‌ను అమర్చారు. ఈ స్కూటర్ 73 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో వెళుతుంది. సింగిల్ ఛార్జ్‌తో 153 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతున్నది. బ్యాటరీని 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని తెలిపింది. ఇందులో 5 అంగులాల టచ్ టీఎఫ్‌టీ డిస్ ప్లే ఇచ్చారు. ఇందులో మ్యాప్స్‌తో పాలు కాల్ ఆన్సర్/ రిజెక్ట్, మ్యూజిక్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఉన్నాయి. జియో ఫెన్స్, థెప్ట్ అలర్ట్, యాక్సిడెంట్ డిటెక్షన్, ఓవర్‌స్పీడ్ అలర్ట్ వంటి భద్రతాపరమైన ఫీచర్లూ జోడించారు.