ఈ టెక్నాలజీ ఆడవాళ్లకు స్పెషల్
ఆడవాళ్ల కోసం రకరకాల స్పెషల్ యాప్స్, గాడ్జెట్స్, వెబ్‌సైట్స్ లాంటివి పుట్టుకొచ్చాయి.
టెక్నాలజీకి ఎవరికైనా ఒకేలా పనిచేస్తుంది. కానీ, ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ అడాప్షన్‌లో మాత్రం ఆడవాళ్ల కంటే మగవాళ్లే ముందున్నారని స్టడీలు చెప్తున్నాయి. దీన్ని సరిచేసేందుకు ఆడవాళ్ల కోసం రకరకాల స్పెషల్ యాప్స్, గాడ్జెట్స్, వెబ్‌సైట్స్ లాంటివి పుట్టుకొచ్చాయి. అలాంటి కొన్ని యూజ్‌ఫుల్ టూల్స్ ఇప్పుడు చూద్దాం.
గిజ్‌మోర్ స్లేట్
ఆడవాళ్ల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన స్మార్ట్‌వాచ్.. గిజ్‌మోర్ స్లేట్. ఇది బాడీ టెంపరేచర్ నుంచి మెనుస్ట్రువల్ సైకిల్ వరకూ ఆడవాళ్ల ఆరోగ్యాన్ని పూర్తిగా ట్రాక్ చేస్తుంది. అలాగే రక్తంలోని ఆక్సిజన్ లెవల్స్, హార్ట్ రేట్, స్లీప్ ట్రాకర్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. పనుల్లో బిజిగా ఉండే ఆడవాళ్లకు ఈ వాచ్ చాలా హెల్ప్ ఫుల్‌గా ఉంటుంది. టైం ప్రకారం నీళ్లు తాగేలా హైడ్రేషన్ అలర్ట్స్ ఇస్తుంది. ఒత్తిడిలో పల్స్ రేట్ పెరిగినప్పుడు స్లో బ్రీతింగ్ చేయమని చెప్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.2099 ఉంది.
క్లూ యాప్
ఆడవాళ్లకుండే రకరకాల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని తయారుచేసిన యాప్ ఇది. ఇది వయసుని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తుంది. ఇందులో మెనుస్ట్రువల్ ట్రాకర్‌తో పాటు ప్రెగ్నెన్సీ కాలెండర్, బర్త్ కంట్రోల్, పీసీఓడీ సింప్టమ్స్ ట్రాకర్.. ఇలా ఈ యాప్‌తో రకరకాల సమస్యలను ముందుగానే గుర్తించే వీలుంటుంది.
విమెన్ కమ్యూనిటీ
ఆడవాళ్లు తమ నెట్‌వర్క్‌ను పెంచుకోడానికి విమెన్ కమ్యూనిటీ యాప్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో ‘షీరోస్’ ఒకటి. ఈ యాప్ సాయంతో ఒక సేఫ్ నెట్‌వర్క్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. కొత్తగా బిజినెస్ పెడుతున్నవాళ్లకు, ఆన్‌లైన్‌లో తమ ప్రొడక్ట్స్ అమ్మాలనుకునేవాళ్లకు, కౌన్సెలింగ్, లోన్స్ కోసం ఈయాప్ ఎంతో యూజ్ ఫుల్‌గా ఉంటుంది.
‘సెనెకా కనెక్ట్’ అనే మరో యాప్‌తో వర్కింగ్ వుమెన్ తమ నెట్‌వర్క్‌ను పెంచుకోవచ్చు. ఇందులో విమెన్ ఎంట్రప్రెన్యూర్స్, విమెన్ లీడర్స్ నుంచి పాడ్‌కాస్ట్స్, ఆర్టికల్స్ రూపంలో డైలీ ఇన్‌స్పిరేషన్ పొందొచ్చు. ఆడవాళ్ల కోసం ఏర్పాటుచేసే ప్రత్యేకమైన ఈవెంట్లు, వెబినార్ల వివరాలు తెలుసుకోవచ్చు.
హెయిర్ కేర్
ఆడవాళ్ల హెయిర్ కేర్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్ ‘మ్యావానా’. ఈ యాప్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో జుట్టు రకాన్ని బట్టి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఏయే ప్రొడక్ట్స్ వాడాలో చెప్తుంది. అలాగే ఈ యాప్ సాయంతో రకరకాల హెయిర్ ఎక్స్‌పర్ట్స్‌ను కూడా కన్సల్ట్ అవ్వొచ్చు.