Apple-Huawei | ఐఫోన్ 15-కు సవాల్.. హువావే మేట్ 60 పోటీ ఇస్తుందా.. ఇవీ కారణాలు?
Apple-Huawei | చైనా టెక్నాలజీ జెయింట్ `హువావే (Huawei)` కొత్త తరం స్మార్ట్ ఫోన్లు హువావే మేట్60 (Huawei Mate 60), హువావే మేట్60 ప్రో (Huawei Mate 60 Pro) అనే ఫోన్లను గతవారం మార్కెట్లో ఆవిష్కరించింది.
Apple-Huawei | చైనా టెక్నాలజీ జెయింట్ `హువావే (Huawei)` కొత్త తరం స్మార్ట్ ఫోన్లు హువావే మేట్60 (Huawei Mate 60), హువావే మేట్60 ప్రో (Huawei Mate 60 Pro) అనే ఫోన్లను గతవారం మార్కెట్లో ఆవిష్కరించింది. 2019లో అమెరికా విధించిన ఆంక్షలను తట్టుకుని నిలబడి మరీ రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు తెచ్చింది హువావే (Huawei). మంగళవారం గ్లోబల్ టెక్ దిగ్గజం `ఆపిల్ (Apple)` కొత్తగా ఐ-ఫోన్ 15 (iPhone-15) సిరీస్ ఫోన్లను మార్కెట్లోకి తేనున్నది. ఈ క్రమంలో చైనా ప్రభుత్వశాఖల అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, సిబ్బంది ఐ-ఫోన్లు వాడొద్దని జీ జిన్‌పింగ్ ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. సరిగ్గా ఆపిల్ `ఐ-ఫోన్ 15` సిరీస్ ఫోన్ల ఆవిష్కరణకు కొద్ది రోజుల ముందే చైనా సర్కార్ నిషేధాజ్ఞలు విధించడానికి కారణాలేమిటి..?
హువావే మేట్ ఎక్స్5 (Huawei Mate X5) ఫోన్‌కు ఫోల్డబుల్ ఫోన్ న్యూ వర్షన్ హువావే మేట్ 60, హువావే మేట్ 60 ప్రో. హువావే మేట్ 60 ఫోన్ ధర 5999 (817.70 డాలర్లు) యువాన్లు. చైనాలో ఆపిల్ ఐ-ఫోన్ 14 ధర కూడా దాదాపు ఇంతే. ప్రపంచ అగ్రశ్రేణి సంస్థ ఆపిల్ `ఐ-ఫోన్ల`కు హువావే కొత్త ఫోన్లు పోటీ ఇస్తాయా.. స్పెషిఫికేషన్స్.. ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం..
హువావే మేట్ 60 (Huawei Mate 60) స్మార్ట్ ఫోన్లు శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థకు మద్దతునిస్తాయి. ఇంటర్నెట్ లేకున్నా, మొబైల్ సిగ్నల్స్ లేకున్నా, పర్వత శ్రేణులపైనైనా, నడి సముద్రంలో ఉన్నా, మీకు ఇష్టమైన వారితో ఫోన్‌లో మాట్లాడవచ్చు. మెసేజ్‌లు పంపవచ్చు.
స్మార్ట్ ఫోన్లలో సెమీ కండక్టర్ చిప్‌లు కీలకంగా వ్యవహరిస్తాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పని చేసినప్పుడు చైనా టెక్ సంస్థలకు ప్రత్యేకించి హువావే వంటి సంస్థలకు టెక్నాలజీ పరంగా, ఉత్పత్తి పరంగా గానీ తోడ్పాటునిస్తే ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తర్వాత కొంత కాలం ఆ ఆంక్షలు సడలించినా.. చైనా కూడా అప్రమత్తమైందని తెలుస్తున్నది.
సొంతంగా సెమీ కండక్టర్ మాన్యుఫాక్చరింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ (ఎస్ఎంఐసీ) ఆధ్వర్యంలో చిప్‌లు, ప్రాసెసర్లు తయారుచేస్తున్నది. హువావే మేట్ 60 సిరీస్ ఫోన్లలో ఏ ప్రాసెసర్ వాడారన్న సంగతి వెల్లడించలేదు కానీ `ఎస్ఎంఐసీ`లో తయారైన `కిరిన్ 9000ఎస్ చిప్`ను వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌కే హైనిక్స్ డ్రామ్, నంద్ కంపొనెంట్స్‌ను ఈ ఫోన్‌లో వాడినట్లు సమాచారం.
ఇతర సంస్థల 5జీ స్మార్ట్ ఫోన్ల కంటే వేగంగా డేటా డౌన్ లోడింగ్ కెపాసిటీ హువావే మేట్ 60 సిరీస్ ఫోన్ల కెపాసిటీ అని సోషల్ మీడియాలో నివేదికలు వస్తున్నాయి. ఆపిల్ ఐ-ఫోన్ 14లో ఫీచర్లు, స్పెషిఫికేషన్లతో హువావే మేట్ 60 సిరీస్ ఫోన్లలో ఫీచర్లను నెటిజన్లు సరిపోల్చి చూస్తున్నారు. హువావే మేట్ 60 ఫోన్లలో ఫీచర్లు, ఐ-ఫోన్ 15లో ఉంటాయా? అన్న విషయమై కేంద్రీకరించారు.
గతవారం ఐ-ఫోన్ల వాడకంపై చైనా ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించినట్లు వచ్చిన వార్తలతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కాసిత ఉలికిపడ్డాయి. గురు, శుక్రవారాల్లో ఆపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16.62 లక్షల కోట్ల (200 కోట్ల డాలర్లు) కోల్పోయింది. అమెరికా తర్వాత ఆపిల్ ఐ-ఫోన్లు చైనాలోనే అత్యధికంగా తయారవుతాయి. ఐ-ఫోన్లకు చైనా అతిపెద్ద మార్కెట్. మొత్తం ఐ-ఫోన్ విక్రయాల్లో చైనాలో ఐదు కోట్ల ఫోన్లు అమ్ముడవుతాయి. కానీ తాజా చైనా సర్కార్ నిషేధం విదించడంతో అమ్మకాలు 50 లక్షల నుంచి కోటి వరకూ తగ్గుతాయని టెక్నాలజీ విశ్లేషకులు చెబుతున్నారు.