తమ్ముడు.. తమ్ముడు అంటూనే పవన్ కల్యాణ్‌ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆడేసుకుంటున్నారు. మీడియా పదేపదే మాట్లాడండి అంటే మాట్లాడుతున్నానే గానీ.. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడడం వేస్ట్ అంటూ పాల్ మాట్లాడారు. పవన్‌కు మతిస్థిమితం ఉంటే 9 పార్టీలతో పొత్తులు మార్చేవారా అని ప్రశ్నించారు.
9 పార్టీలతో పొత్తులు మార్చినందుకు క్షమాపణ చెబితే పవన్ సీఎం అయ్యేలా ఆశీర్వాదిస్తానన్నారు. జనసేన వదిలేసి ప్రజాశాంతి పార్టీలోకి వస్తే ముఖ్యమంత్రిని చేస్తానని.. ఒకవేళ తాను గెలిపించుకోలేకపోతే పరిహారంగా పవన్ కల్యాణ్‌కు వెయ్యి కోట్లు ఇస్తానని ఆఫర్ చేశారు. పెద్దదానికి మొగుడు లేడు.. కడదానికి కల్యాణం అన్నట్టు అసలు పవన్‌కు అమిత్ షా అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడంలేదని.. అలాంటప్పుడు సీఎం ఎలా చేస్తారని ప్రశ్నించారు.
తమ పార్టీ తరపున ఐదుగురు అధికార ప్రతినిధులను తాను నియమిస్తే ఒక్క చానల్ కూడా తమవారిని చర్చలకు పిలవడం లేదని.. అదే పవన్ కల్యాణ్ గురించి మాత్రం డిబేట్లుపెట్టేస్తున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే యూట్యూబ్‌లో 40 మంది కూడా చూడరని.. అదే తనను చూపిస్తే రేటింగ్ అయినా ఉంటుందన్నారు. పవన్ కల్యాణ్ జనసేన పెట్టినప్పుడు నా తమ్ముడు పార్టీ పెట్టాడని ఆనందిస్తే… అన్న చిరంజీవి కంటే వరెస్ట్‌గా తయారైపోయాడని పాల్ ఆవేదన చెందారు.
రాజ్యసభ సీటు, 1500 కోట్ల డబ్బుకు చిరంజీవి కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారని.. పవన్ కల్యాణ్ కూడా వచ్చే ఎన్నికల తర్వాత రాజ్యసభ తీసుకుని బీజేపీలో జనసేనను విలీనం చేస్తారని పాల్ అభిప్రాయపడ్డారు. కాబట్టి ఓడిపోయే పవన్ గురించి కాకుండా గెలిచే తమ పార్టీపై మీడియా దృష్టి పెట్టాలని పాల్ విజ్ఞప్తి చేశారు.