ప్రపంచవ్యాప్తంగా లింగ అసమానతలు పెరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల హక్కులు రోజురోజుకు కనుమరుగవుతున్నాయని, లింగ సమానత్వం రావడానికి మరో 300 ఏళ్ళు పట్టొచ్చని ఆయన అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో గుటెర్రెస్ ప్రసంగించారు.
“ప్రపంచ వ్యాప్తంగా మహిళల హక్కులపై దాడులు జరుగుతున్నాయి. హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ప్రసూతి మరణాలు, బాలికలకు విద్యను నిరాకరించడం, బలవంతపు బాల్య వివాహాలు, మాతాశిశు మరణాలు పెరుగుతున్నాయి. గర్భధారణ, ప్రసవ సమయంలో ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ మరణిస్తుంది. ” అని గుటెర్రెస్ అన్నారు.
“దశాబ్దాలుగా సాధించిన ప్రగతి మన కళ్ల ముందే కనుమరుగవుతోంది” అని గుటెర్రెస్ అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు మహిళలను ప్రజా జీవితంలో లేకుండా చేశారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
“కోవిడ్-19 మహమ్మారి ప్రభావం వల్ల లక్షలాది మంది బాలికలు బడి మానేయాల్సి వచ్చింది. అనేక మంది మహిళలు ఉపాధి కోల్పోయారు. వేలాది బాల్య వివాహాలు జరిగాయి. ఉక్రెయిన్ నుండి సహేల్ వరకు, సంక్షోభం, సంఘర్షణల్లో మొదట మహిళలు, బాలికలే బలయ్యారు. ” అన్నారాయన.