మనుషులకూ బర్డ్ ఫ్లూ ముప్పు! - ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
సాధారణంగా ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు పక్షుల్లో వ్యాపిస్తాయి. కానీ, గత కొంతకాలంగా క్షీరదాల్లో ఇవి తరచూ వెలుగు చూస్తుండటం గమనార్హం.
సాధారణంగా పక్షుల్లో వ్యాపించే బర్డ్ ఫ్లూ మనుషులకూ సోకే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. కొంతకాలంగా క్షీరదాల్లో బర్డ్ ఫ్లూ కేసులు తరచూ వెలుగుచూస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఇవి మనుషులకు కూడా సోకేలా రూపాంతరం చెందే అవకాశం లేకపోలేదని తెలిపింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
సాధారణంగా ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు పక్షుల్లో వ్యాపిస్తాయి. కానీ, గత కొంతకాలంగా క్షీరదాల్లో ఇవి తరచూ వెలుగు చూస్తుండటం గమనార్హం. ఈ కేసులు దాదాపు 10 దేశాల్లో బయటపడ్డాయి.
దీంతో మనుషులకూ సులువుగా సంక్రమించేలా క్షీరదాల్లో ఈ వైరస్ రూపాంతరం చెందే ముప్పు ఉందని WHO ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని క్షీరదాల్లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు కలగలిసి మనుషులు, జంతువులకు హాని కలిగించే కొత్త వైరస్‌లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని వివరించింది.