Telugu Global
NEWS

నీ వల్ల నష్టపోయాం.. విజయ్‌ దేవరకొండకు షాక్‌..!

ప్రస్తుతం ఖుషి సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఈ సినిమా ద్వారా తనకు వచ్చిన సంపాదనలో కోటి రూపాయలను ఫ్యాన్స్‌కు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు.

నీ వల్ల నష్టపోయాం.. విజయ్‌ దేవరకొండకు షాక్‌..!
X

ఖుషి సినిమా సక్సెస్‌ కావడంతో.. ఆ మూవీ ద్వారా వచ్చిన సంపాదనలో నుంచి రూ.కోటిని అభిమానులకు ఇస్తానని హీరో విజయ్ దేవరకొండ ప్రకటించడం టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. విజయ్‌ దేవరకొండ కాదు బంగారుకొండ అంటూ అభిమానులు, నెటిజన్లు ఆయనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అయితే వరల్డ్‌ ఫేమస్‌ లవర్ సినిమా ద్వారా 8 కోట్ల రూపాయలు నష్టపోయాం.. అందుకోసం తమకూ సాయం చేయాలంటూ ఆ సినిమా నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

డియర్ విజయ్ దేవరకొండ.. వరల్డ్ ఫేమస్‌ లవర్‌ సినిమా పంపిణీలో రూ.8 కోట్లు నష్టపోయాం. కానీ దానిపై ఎవరూ స్పందించలేదు. మీరు దయాహృదయంతో రూ. కోటిని మీ అభిమానులకు అందిస్తున్నారు. మా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలకు కూడా సాయం చేసి ఆదుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ అభిషేక్ పిక్చర్స్‌ ట్వీట్ చేసింది. విజయ్‌ హీరోగా 2020లో వచ్చిన వరల్డ్‌ ఫేమస్ లవర్ సినిమాను అభిషేక్ పిక్చర్స్‌ ఏపీలో డిస్ట్రిబ్యూట్ చేసింది.


అయితే అభిషేక్‌ పిక్చర్స్ తీరుపై సోషల్ మీడియాలో విజయ్‌ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. చిరంజీవి లాంటి పెద్ద హీరోల వల్ల నష్టం జరిగి ఉంటే ఇలానే అడిగేవారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. విజయ్‌ ఎలాంటి నేపథ్యం లేకుండా ఎదిగినందువల్లే ఆయన్ను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. అసలు నిన్ను ఎవడు కొనమన్నాడురా ఆ సినిమాని అంటూ కొంత మంది ఫ్యాన్స్.. నిర్మాత అభిషేక్ నామాను తిట్టిపోస్తున్నారు.

ప్రస్తుతం ఖుషి సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఈ సినిమా ద్వారా తనకు వచ్చిన సంపాదనలో కోటి రూపాయలను ఫ్యాన్స్‌కు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. వైజాగ్‌లో జరిగిన సక్సెస్‌ మీట్‌లో విజయ్ ఈ ప్రకటన చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఇస్తానని అనౌన్స్ చేశారు. దీని కోసం గూగుల్ ఫామ్స్ క్రియేట్ చేశారు విజయ్ దేవరకొండ. ఈ గూగుల్ ఫామ్స్ ద్వారా ఆశావహులు లక్ష రూపాయల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

*

First Published:  6 Sept 2023 5:01 AM GMT
Next Story