ముందుకు కదలని 'వాట్సప్ పే'.. ఇండియా హెడ్ రాజీనామా
వాట్సప్ పేకు రాజీనామా చేసిన మనేశ్ మహాత్మే తిరిగి అమెజాన్ ఇండియాలో స్ట్రాటజిక్ రోల్‌లో చేరబోతున్నట్లు సమాచారం. మనేశ్ కంపెనీని వదిలేసినట్లు 'మెటా' కూడా ధృవీకరించింది. వాట్సప్ పేమెంట్ విభాగం అభివృద్ధికి మనేశ్ చాలా కృషి చేశారని చెప్పింది
దేశంలో డిజిటల్ చెల్లింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. చేతిలో క్యాష్ లేకపోయినా.. మొబైల్ ఫోన్‌తో చెల్లింపులు చేస్తుండటంతో పేమెంట్ యాప్స్‌కు గిరాకీ పెరిగిపోయింది. ప్రస్తుతం దేశంలో 48 శాతం వాటాతో 'ఫోన్ పే' అగ్రగామిగా ఉన్నది. ఈ క్రమంలో 'మెటా' సంస్థ తమ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ 'వాట్సప్'లో కూడా పేమెంట్ ఆప్షన్‌ను జత చేసింది. 'వాట్సప్ పే'కు వినియోగదారులు పెంచాలని అనేక ప్రయత్నాలు చేసింది. చివరకు అమెజాన్ పే డైరెక్టర్, బోర్డు మెంబర్‌గా ఉన్న మనేశ్ మహాత్మేను వాట్సప్ తెచ్చుకుంది. 'వాట్సప్ పే' కంట్రీ హెడ్, డైరెక్టర్‌గా నియమించింది. 2021 ఏప్రిల్‌లో కంపెనీ బాధ్యతలు స్వీకరించిన మనేశ్.. పేమెంట్ యాప్ పాపులర్ కావడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అయితే 18 నెలల జర్నీలో వాట్సప్ పే డిజిటల్ చెల్లింపులు పెద్దగా పెరిగింది లేదు. దీంతో ఆయన కంపెనీకి రాజీనామా చేసినట్లు తెలుస్తున్నది.
వాట్సప్ పేకు రాజీనామా చేసిన మనేశ్ మహాత్మే తిరిగి అమెజాన్ ఇండియాలో స్ట్రాటజిక్ రోల్‌లో చేరబోతున్నట్లు సమాచారం. మనేశ్ కంపెనీని వదిలేసినట్లు 'మెటా' కూడా ధృవీకరించింది. వాట్సప్ పేమెంట్ విభాగం అభివృద్ధికి మనేశ్ చాలా కృషి చేశారని చెప్పింది. ఆయన భవిష్యత్ కార్యాచరణలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నది. కాగా, మెటా సంస్థకు వాట్సప్ పేమెంట్స్ ఇంకా ప్రయార్టీగానే ఉన్నట్లు పేర్కొన్నది. ఇండియాలో డిజిటల్ పేమెంట్లకు ఇంకా చాలా అవకాశం ఉన్నది. మార్కెట్ షేర్ పెంచుకోవడాని కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. త్వరలోనే 50 కోట్ల మంది కస్టమర్లను చేర్చుకోవాలనే టార్గెట్ పెట్టుకున్నట్లు వెల్లడించింది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నవంబర్ 2020లో వాట్సప్ కూడా యూపీఐ కార్యాకలాపాలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. అయితే అప్పుడు కేవలం 20 మిలియన్ కస్టమర్ల పరిమితిని విధించింది. 2021లో 40 మిలియన్లు, ఈ ఏడాది ఏప్రిల్‌లో 100 మిలియన్ కస్టమర్లకు పరిమితిని పెంచింది. అయితే, వాట్సప్ ద్వారా పేమెంట్లు చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. యూపీఐ పేమెంట్లలో కేవలం 1 శాతం వాటానే వాట్సప్ కలిగి ఉన్నది. ఇటీవల క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించినా.. పేమెంట్లు చేసే వాళ్లు మాత్రం పెరగడం లేదు.