Telugu Global
NEWS

సాయంత్రం స్నాక్స్‌ ఏం తిందాం..

పెద్ద పొరపాటు జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఏదైనా తినడం వల్ల అప్పటికి ఆకలి శాంతించినా, దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

సాయంత్రం స్నాక్స్‌ ఏం తిందాం..
X

సాధారణంగా సాయంత్రం నాలుగు లేదా ఐదు గంట‌ల సమయంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్నాక్ ఐటమ్ తినాలనిపిస్తుంది. ఇక శీతాకాలం సాయంత్రాలు వేడి వేడిగా ఏదైనా తినాలిపిస్తుంది. అప్పటికి భోజనం చేసి కొన్ని గంటలై ఉంటుంది, డిన్నర్‌కి ఇంకా కొన్ని గంటల సమయం మిగిలే ఉంటుంది. ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేవారు అలసిపోయి ఏదన్నా తిందాం అనుకుంటారు. భోజనం ఎలాగూ ఆలస్యమవుతుందన్న ఆలోచనతో ఏదో ఒకటి కడుపులో పడేసేందుకు ప్రయత్నిస్తారు.


అయితే, అక్కడే పెద్ద పొరపాటు జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఏదైనా తినడం వల్ల అప్పటికి ఆకలి శాంతించినా, దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సాధారణంగా ఎక్కువ శాతం మంది ఈ పకోడీ, మిర్చి బజ్జి, బర్గర్, పిజ్జా, పానీపూరి.. ఇలా ఏదో ఒకటి కానిచ్చేస్తారు. ఇంకొంతమంది టీ, కాఫీలు తాగడంతో పాటు సిగరెట్లు కూడా కాలుస్తుంటారు. ఇలా మనం ఏదన్నా ఆహారం తీసుకునేప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ సూచికను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఇంతకీ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటో తెలుసా...

డైట్ గురించి వివరించే సందర్భంలో గ్లైసిమిక్ ఇండెక్స్‌‌ పదాన్ని వాడతారు. ఆహారంలోని కార్బొహైడ్రేట్స్‌ను లెక్కగట్టే పద్ధతిని గ్లైసిమిక్ ఇండెక్స్‌గా వ్యవహరిస్తారు. మనం తీసుకునే ఆహారం రక్తంలోని చక్కెర(గ్లూకోజ్)పై ఎలా ప్రభావం చూపుతుందో ఇది తెలియజేస్తుంది. ఆహారం తీసుకున్న వెంటనే అరిగిపోయి, రక్తంతో కలిసి, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అమాంతం పెంచేసే ఆహారాలను గ్లైసిమిక్ ఆహారాలుగా వ్యవహరిస్తారు. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, తియ్యని శీతల పానీయాలు, వైట్ బ్రెడ్, బంగాళ దుంపలు, అన్నం వంటివి దీనికి ఉదాహరణ. అలాగే ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయి నెమ్మదిగా పెరిగేందుకు కారణమయ్యే వాటిని 'లో గ్లైసిమిక్ ఫుడ్స్‌'గా వ్యవహరిస్తారు. పండ్లు, కూరగాయలు, పప్పులు, ఓట్స్ వంటి ధాన్యాలు ఈ జాబితాలో ఉంటాయి.


అయితే ఏం తినాలి..

ఎప్పుడూ బయట దొరికేవీ, వేడిగా ఉండేవే కాకుండా సులువుగా ఇంట్లో చేసుకొనేలా ఉండేవాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. మఖానా లేదా తామర గింజలు ఆరోగ్యానికి మేలు చేసే ఉత్తమమైన స్నాక్స్ గా చెప్పుకోవచ్చు. వీటిని తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. అలాగే స్నాక్స్ గా వేయించిన శనగలను కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే శనగల్లో ఫైబర్, ప్రోటీన్ మెండుగా ఉంటాయి. ప్రస్తుతం చలికాలం అయినందున సాయంత్రం వేళ వేడివేడిగా వెజిటేబుల్ సూప్‌ను తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఇక పాప్ కార్న్ చాలా సులభంగా తయారు చేసుకోగలిగే రుచికరమైన స్నాక్. క్యారెట్, దోసకాయ, బెల్ పెప్పర్, రంగురంగుల కూరగాయలన్నీ కలిపి తీసుకోవడం కూడా మంచిదే. సాయంత్రం వేళ నట్స్, ఓట్స్, డార్క్ చాక్లెట్, ఫ్రూట్స్ వంటి వాటిని కూడా తీసుకోవచ్చు.

First Published:  11 Jan 2024 5:16 PM IST
Next Story