టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లంటే అందులో సగం పసికూనలే. నమీబియా, ఒమన్, కెనడా, అమెరికా, పపువా న్యూగినియా .. ఈ జట్లన్నీ పెద్ద జట్లకు రికార్డుల పంట పండించుకోవడానికే పనికొస్తాయని భావిస్తున్నారు. అయితే పసికూనల్లాంటి ఆ జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో ప్రదర్శించిన కసి.. వారేమీ అల్లాటప్పాగా టోర్నీకి రాలేదన్న సంకేతాలిస్తున్నాయి.
విండీస్‌కు షాకివ్వబోయిన పపువాన్యూగినియా
ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పపువాన్యూగినియా సూపర్‌గా పోరాడింది. ఓ దశలో సంచలన విజయం నమోదు చేసేలా కనిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆజట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టుకు ముచ్చెమటలు పట్టించింది. అరివీర భయంకర హిట్టర్లతో నిండిన వెస్టిండీస్ ఆ స్వల్ప లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లు తీసుకుందంటే పపువా జట్టు ఎంతగా పోరాడిందో అర్థం చేసుకోవచ్చు. టీ20ల్లో ఇప్పటికీ టాప్‌లోనే ఉండే విండీస్ జట్టును ఎదుర్కొని ఆలౌట్ కాకుండా నిలబడటం, చేధనలో ఆ జట్టును ఒకానొక దశలో ఓటమి భయం కలిగించడం పపువా న్యూగినియా జట్టుకు ప్రశంసలు తెచ్చిపెట్టింది.
నమీబియాను భయపెట్టిన ఒమన్
సోమవారం జరిగిన మరో మ్యాచ్‌లో అంతర్జాతీయ అనుభవంలో తమకంటే చాలాముందున్న నమీబియాను పసికూన ఒమన్ భయపెట్టింది. మ్యాచ్‌ను టై చేసి సూపర్ ఓవర్ దాకా లాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 109 పరుగులకు ఆలౌటైంది. నమీబియా అలవోకగా గెలిచేస్తుందనుకుంటే ఆ జట్టు 20 ఓవర్లలో 109 పరుగులే చేయగలిగింది. సూపర్ ఓవర్లో ఒత్తిడికి నిలవలేక ఓడిపోయినా ఒమన్ పోరాటం క్రికెట్ లవర్స్‌ను ఆకట్టుకుంది.