Telugu Global
NEWS

ఆ వయసులో మద్యం తాగితే మటాషే..

15 నుంచి 39 ఏళ్లలోపు ఉన్నవారు మద్యపానం చేయడం మరీ ప్రమాదం అంటున్నారు నిపుణులు.

ఆ వయసులో మద్యం తాగితే మటాషే..
X

మద్యం తాగడం హానికరం, ఏ వయసువారికైనా ఇది వర్తించేదే. కానీ మద్యపానంలో కూడా హైరిస్క్ గ్రూప్ లు ఉంటాయని చెబుతోంది లాన్సెట్ జర్నల్ కథనం. అవును.. మద్యపానంపై వాషింగ్టన్ యూనివర్శిటీ ఆసక్తికర అధ్యయనం చేసింది. మద్యపానం చేస్తే ఏ వయసువారు ఎక్కువ నష్టపోతారు, స్త్రీ పురుషుల్లో ఎవరికి మద్యపానం ఎక్కువ హానికరం, ఏ ప్రాంతవాసులకు మద్యపానం వల్ల వచ్చే లివర్ వ్యాధులు తక్కువ అనే అంశాలపై అధ్యయనం చేసింది. ఆ నివేదికను లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. మొత్తం 204 దేశాలనుంచి సమాచారం సేకరించారు.

హైరిస్క్ గ్రూప్..

15 నుంచి 39 ఏళ్లలోపు ఉన్నవారు మద్యపానం చేయడం మరీ ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఆరోగ్య సమస్యలే కాదు, యాక్సిడెంట్లు, ఆత్మహత్యలు, కుటుంబ సమస్యలు.. ఇలాంటివన్నీ ఈ ఏజ్ గ్రూప్ వారికే ఎక్కువగా వస్తాయట. మరణాలు కూడా ఈ ఏజ్ గ్రూప్ వారిలోనే ఎక్కువగా నమోదవుతున్నాయని ఆ అధ్యయనం తేల్చింది. 40 దాటినవారు ఆల్కహాల్ పరిమితంగా తీసుకుంటే వారి ఆరోగ్యానికి అది పరోక్షంగా మంచిదని అంటున్నారు. 40 దాటినవారు ఆల్కహాల్ తీసుకునే మోతాదు కూడా తక్కువtగానే ఉంటుందట. 15 నుంచి 39 మధ్య ఉన్నవారు ఈ విషయంలో కాస్త శృతి మించుతారని, అందుకే అది వారి ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

40 దాటితే కాస్త తగిలించండి..

40ఏళ్లుదాటినవారు ఆల్కహాల్ తీసుకుంటే అది కూడా పరిమితంగా (రోజుకి 100 మిల్లీ లీటర్లు).. గుండె సమస్యలు, ఇతర అనారోగ్యాలకు దూరంగా ఉంటారని చెబుతుందీ అధ్యయనం. కానీ అలవాటైతే ఓ పట్టాన మానుకోలేరు కాబట్టి.. దాని జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదని అంటున్నారు. 40 దాటినవారిలో పురుషులకంటే స్త్రీలు కాస్త ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది లేదని అంటున్నారు వైద్య నిపుణులు.

First Published:  15 July 2022 3:10 PM IST
Next Story