Telugu Global
NEWS

రెక్కీ లేదు, కుట్ర లేదు - తేల్చేసిన హైదరాబాద్ పోలీసులు

పవన్‌ కల్యాణ్ నివాసం వద్ద రెక్కీ జరిగిందంటూ టీడీపీ, జనసేన చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చేశారు హైదరాబాద్ పోలీసులు. రెక్కీ లేదు, కుట్ర లేదు కేవలం తప్పతాగి చేసిన న్యూసెన్స్‌గా స్పష్టం చేశారు.

రెక్కీ లేదు, కుట్ర లేదు - తేల్చేసిన హైదరాబాద్ పోలీసులు
X

హైదరాబాద్‌లోని పవన్‌ కల్యాణ్ నివాసం వద్ద రెక్కీ జరిగిందంటూ టీడీపీ, జనసేన చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చేశారు హైదరాబాద్ పోలీసులు. మొన్న అర్ధ‌రాత్రి ముగ్గురు యువకులు పవన్ ఇంటి వద్ద సెక్యూరిటీతో గొడవ పడగా.. దాన్ని అడ్డుపెట్టుకుని అది రెక్కీ, పవన్ హత్యకు కుట్ర అంటూ జనసేన ప్రచారం చేస్తోంది. ఏకంగా రూ.250 కోట్లతో పవన్ హత్యకు సుపారీ అంటూ జనసేన చానళ్లు ప్రచారం చేశాయి.

దాంతో లోతుగా హైదరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేశారు. రెక్కీ లేదు, కుట్ర లేదు కేవలం తప్పతాగి చేసిన న్యూసెన్స్‌గా తేల్చారు. పబ్‌లో ఫుల్‌గా మద్యం తాగేసిన సాయికృష్ణ చౌదరి అతడి స్నేహితులు ఇద్దరు.. పవన్‌ ఇంటి వద్ద కారు ఆపారు. ఆ కారును తీయాల్సిందిగా పవన్ సెక్యూరిటీ హెచ్చరించడంతో మద్యం మత్తులో సాయికృష్ణ చౌదరి అతడి స్నేహితులు గొడవపడ్డారు.

పవన్ సెక్యూరిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ముగ్గురు యువకులను స్టేషన్‌కు పిలిచి విచారించారు. తాము కేవలం తాగిన మైకంలో గొడవ చేశామని వారు అంగీకరించారు. కారు సాయికృష్ణ చౌదరిదేనని పోలీసులు నిర్ధారించారు. అనంతరం ఆ ముగ్గురు యువకులను వదిలిపెట్టారు. రెక్కీ నిర్వహించారంటూ జరిగిన ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని పోలీసులు ప్రకటించారు.

ఇప్పటికే పవన్ హత్యకు రెక్కీ నిర్వహించారంటూ, పవన్‌కు సెక్యూరిటీ కల్పించాలంటూ కేంద్ర హోంమంత్రికి రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. హైదరాబాద్‌లో గొడవ జరిగినప్పటికీ ఈ ఘటనపై జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ డిమాండ్ చేశారు. తీరా పోలీసులు మాత్రం రెక్కీ లేదు.. కుట్ర లేదని తేల్చడంతో ఇదంతా రెచ్చగొట్టేందుకు చేసిన ప్రచారం అని తేలిపోయింది.

First Published:  4 Nov 2022 8:19 PM IST
Next Story