Telugu Global
NEWS

ఏపీ, తెలంగాణ హైకోర్టుల నుంచి జడ్జిల బదిలీ

జస్టిస్ అభిషేక్ రెడ్డిని పాట్నా హైకోర్టుకు, జస్టిస్ నాగార్జునను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తున్నారు. ఇక ఏపీ హైకోర్టు నుంచి జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్ డి. రమేష్‌ను బదిలీ చేస్తూ కొలిజియం సిఫార్సు చేసింది.

ఏపీ, తెలంగాణ హైకోర్టుల నుంచి జడ్జిల బదిలీ
X

ఏపీ, తెలంగాణ హైకోర్టు నుంచి పలువురు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయగానే న్యాయమూర్తులు బదిలీపై వెళ్తారు. తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్‌ నాగార్జున బదిలీ అవుతున్నారు. కన్నెగంటి లలిత గతంలో ఏపీ హైకోర్టులో పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టుకు వచ్చారు. ఆమెను ఇప్పుడు కర్నాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలిజియం సిఫార్సు చేసింది.

జస్టిస్ అభిషేక్ రెడ్డిని పాట్నా హైకోర్టుకు, జస్టిస్ నాగార్జునను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తున్నారు. ఇక ఏపీ హైకోర్టు నుంచి జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్ డి. రమేష్‌ను బదిలీ చేస్తూ కొలిజియం సిఫార్సు చేసింది. బట్టు దేవానంద్‌ మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ అవుతున్నారు. జస్టిస్ డి. రమేష్‌ను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలిజియం సిఫార్సు చేసింది.

అప్పట్లో సుప్రీంకోర్టుకు జగన్‌మోహన్ రెడ్డి రాసిన ఫిర్యాదు లేఖలో జస్టిస్ కన్నెగంటి లలిత పేరు ఉంది. ఇటీవల ఏపీ రాజధాని ఏంటో కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నామంటూ బహిరంగ వేదికలపై వ్యాఖ్యలు చేయడం ద్వారా జస్టిస్ బట్టు దేవానంద్ వార్తల్లో నిలిచారు.

తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు న్యాయమూర్తుల బదిలీతో అక్కడ జడ్జిల సంఖ్య 30కి తగ్గింది. ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల బదిలీతో జడ్జిల సంఖ్య 28కి తగ్గుతుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత వీరంతా బదిలీలపై వెళ్తారు.

First Published:  25 Nov 2022 7:06 AM IST
Next Story