Telugu Global
NEWS

మళ్లీ టమాటా మంట.. సెంచరీ దాటిన పచ్చిమిర్చి

కిలో టమాటా రూ.80 నుంచి రూ. 100 పలుకుతోంది. ఇక పచ్చిమిర్చి రేటు ఇంతకంటే ఎక్కువగా ఉంది. కిలో పచ్చిమిర్చి రూ.120కి పైగా ధర పలుకుతోంది.

మళ్లీ టమాటా మంట.. సెంచరీ దాటిన పచ్చిమిర్చి
X

మళ్లీ టమాటా మంట.. సెంచరీ దాటిన పచ్చిమిర్చి

టమాటా రేటు మరోసారి మండిపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కిలో టమాటా రూ.80 నుంచి రూ. 100 పలుకుతోంది. ఇక పచ్చిమిర్చి రేటు ఇంతకంటే ఎక్కువగా ఉంది. కిలో పచ్చిమిర్చి రూ.120కి పైగా ధర పలుకుతోంది. ఇవి హోల్ సేల్ మార్కెట్ ధరలు కాగా.. రిటైల్‌గా అమ్మే అంగళ్ళలో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ధరలు పెరగడంతో టమాటా, పచ్చిమిర్చిలను సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది.

ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగానే పంట దిగుబడులు తగ్గి టమాటా, పచ్చి మిర్చి ధరలు మండిపోతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా మామూలుగా జూన్ ఆరంభంలో వర్షాలు కురిసేవి. అయితే ఈసారి నైరుతి రుతుపవనాల రాక ఆల‌స్యం కారణంగా పంటల దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు. రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఈసారి టమాటా దిగుబడి బాగా తగ్గింది. ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ అయిన మదనపల్లెకు చాలా తక్కువగా టమాటాలు వస్తున్నాయి. దీంతో టమాటాల కొనుగోలుకు వ్యాపారులు పోటీపడుతుండటంతో ధరలు పెరిగాయి.

ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో టమాటా, పచ్చిమిర్చి కొంతమేర సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతుండటంతో రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. ఈ కారణాల వల్ల కూడా టమాటా, పచ్చిమిర్చితో పాటు ఇతర కూరగాయల ధరలు పెరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లలోకి తాజా పంట వస్తేనే ధరల మంట నుంచి ఉపశమనం కలుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

First Published:  27 Jun 2023 4:39 PM IST
Next Story