Telugu Global
NEWS

టాలీవుడ్‌లో బిరుదుల గోల

అగ్ర హీరోలకు సినిమాకొక బిరుదు తగిలించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. హీరోల బిరుదుల గోల ఏంటో తెలీదు కానీ ఈ వ్యవహారానికి సంబంధించి అగ్ర హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు తలెత్తుతున్నాయి.

టాలీవుడ్‌లో బిరుదుల గోల
X

టాలీవుడ్‌లో ప్రేక్షకాదరణ పొందిన నటులకు మొదటి నుంచి బిరుదులు ఉన్నాయి. ఎన్టీఆర్‌ను విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని, ఏఎన్ఆర్‌ను నట సామ్రాట్, కృష్ణను సూపర్ స్టార్, కృష్ణంరాజును రెబల్ స్టార్ అని పిలిచేవారు. ఆ తర్వాత తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లకు కూడా బిరుదులు ఉన్నాయి. ఒక్కో స్టార్‌కు ఒక్క బిరుదు పెట్టడం మామూలే అయినా ఇప్పుడు మాత్రం రెండేసి బిరుదులు, మూడేసి బిరుదులు పెడుతూ ఇండస్ట్రీలో కొందరు వివాదాలు సృష్టిస్తున్నారు.

ఇప్పటి తరం హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను అభిమానులు యంగ్ టైగర్ అని పిలుస్తుంటారు. అయితే కొంతకాలం కిందట ఆయనకు యంగ్ టైగర్ బిరుదుతో పాటు మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే బిరుదు పెట్టారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో కొద్ది రోజులు ఆయన్ను అలాగే పిలిచారు. అయితే రంగస్థలం సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత రామ్ చరణ్‌ను ఆయన అభిమానులు మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పిలవడం మొదలుపెట్టారు. చరణ్‌ను ఇప్పటికే మెగా పవర్ స్టార్ అని పిలుస్తుండగా.. అభిమానులు ఆయనకు మళ్లీ మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే తోక పెట్టారు. అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే బిరుదు ఇప్పటికే మేం ఎన్టీఆర్ కు పెట్టుకున్నామని ఆయన ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ తో సోషల్ మీడియా వేదికగా కయ్యానికి దిగారు.

ఇదిలా ఉండగా చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా కొన్ని నెల కిందట విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే అదే సమయంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా సూపర్ హిట్ కావడంతో నందమూరి అభిమానులు కళ్యాణ్ రామ్‌ని మెగా స్టార్ అని సంబోధించారు. కళ్యాణ్ రామ్ పేరుకు మెగా స్టార్ అనే బిరుదు జత చేసి ట్విట్టర్లో ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. అది అప్పట్లో పెద్ద వివాదాస్పదం అయింది.

కళ్యాణ్ రామ్ నటించిన ఒక్క సినిమా సూపర్ హిట్ అయినంత మాత్రాన ఆయన్ను మెగా స్టార్ అని పిలవాలా.. అని మెగా ఫ్యాన్స్ విమర్శలు చేశారు. అప్పుడు నందమూరి ఫ్యాన్స్ మా హీరోకు మేం పెట్టుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే బిరుదును మీరు పెట్టుకున్నప్పుడు మాకూ ఇలాగే బాధ కలిగింది.. అంటూ కౌంటర్లు ఇచ్చారు.

కాగా, ఇటీవల చిరంజీవి అభిమానులు తమ అభిమాన హీరోను బాస్ ఆఫ్ మాసెస్ అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో నందమూరి అభిమానులు మేమేమీ తక్కువ తినలేదంటూ బాలకృష్ణను గాడ్ ఆఫ్ మాసెస్ అని పిలవడం మొదలుపెట్టారు. కాగా నిన్న బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేయగా అందులో బాలకృష్ణ పేరు పక్కన గాడ్ ఆఫ్ మాసెస్ అనే బిరుదు కనిపించింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలకు కొత్త కొత్త తోకలు తగిలిస్తుండగా మేకర్స్, హీరోలు కూడా వాటిని ఫాలో కావడం గమనార్హం.

ఇదిలా ఉండగా చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక పక్కా మాస్ సినిమా వస్తోంది. ఈ సినిమా టైటిల్ టీజర్ దీపావళికి విడుదల చేస్తామని మేకర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించి ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో చిరంజీవిని మెగా స్టార్ అని కాకుండా మాస్ మూలవిరాట్ అని సంబోధించారు. చిరంజీవి మెగా స్టార్‌గా అందరికీ సుపరిచితులే. అలాంటిది ఆయనకు కూడా సినిమాకొక బిరుదు తగిలిస్తున్నారు. ఇలా అగ్ర హీరోలకు సినిమాకొక బిరుదు తగిలించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. హీరోల బిరుదుల గోల ఏంటో తెలీదు కానీ ఈ వ్యవహారానికి సంబంధించి అగ్ర హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు తలెత్తుతున్నాయి.

First Published:  22 Oct 2022 2:48 PM IST
Next Story