సానుకూల మనస్తత్వాన్ని ఇలా పెంపొందించుకోవచ్చు!!
ప్రతికూల పరిస్థితిలో కూడా సానుకూల మనస్తత్వాన్ని కలిగి ఉండటం వల్ల చాలా గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయని పరిశోధనల్లో తెలిసింది.
ఊహించనివి జరగడమే జీవితం అంటారు పెద్దలు. అదంతా మెట్ట వేదంతంలా అనిపించినా చాలామంది జీవితాల్లో ఎన్నో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో మనిషికి సానుకూలమైనవి జరిగినప్పుడు సంతోషపడిపోతారు. కానీ ప్రతికూలమైన సంఘటనలు జరిగినప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మానసికంగా చాలా ఆందోళనకు గురవుతారు. ప్రతికూల పరిస్థితిలో కూడా సానుకూల మనస్తత్వాన్ని కలిగి ఉండటం వల్ల చాలా గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయని పరిశోధనల్లో తెలిసింది.
ప్రతికూల పరిస్థితులలో కూడా సానుకూలంగా ఉండటమంటే అది సమస్యల్లో ఉన్నప్పుడు కూడా పాజిటివ్‌గా ఉండటం, ఆ సమస్యల్లో ఉన్న మంచిని గ్రహించడం అని అర్థం. ఈ రకమైన స్వభావం అలవాటు చేసుకోవడం వల్ల వ్యక్తుల్లో మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకోగలిగే సామర్థ్యం పెరుగుతుంది.
పరిస్థితులు ఎలాంటివి అయినా ప్రతిదాంట్లో మంచిని చూడగలిగితే సమస్య ప్రభావం వ్యక్తుల మీద పడకుండా ఉంటుందని, ఆ స్వభావం అలవాటు కావాలంటే ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఎవరికి వారు పరిస్థితుల గురించి అందులో ఉన్న మంచి గురించి చర్చించుకోవాలని ఢిల్లీలోని శ్రీ బాలాజీ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో కన్సల్టెంట్ సైకాలజిస్ట్ డాక్టర్ పల్లవి జోషి తెలిపారు.
సమస్యలు ఎదురైనప్పుడు సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడానికి కొన్ని మార్గాలు చెప్పారు డాక్టర్ పల్లవి జోషి..
మంచి విషయాలపై దృష్టి పెట్టడం!!
◆ ఎదురయ్యే సమస్యలు ఏవైనా అందులో మంచిని మాత్రమే వెతకాలి. సమస్యలు, ఇబ్బందులు జీవితంలో సాధారణమనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.
◆ "వెతికితే ప్రతిదాంట్లో మంచి విషయం ఉండకపోదు, వేలెత్తిచూపడానికి చెడు విషయాలు ఉండకపోవు" అని పెద్దలు చెప్పే మాటలో అంతరార్థాన్ని గ్రహించాలి. చిన్న మంచి కూడా ఎంతో మానసిక బలాన్ని ఇస్తుంది.
◆ అనుకున్నపనులు జరగకపోయినా, చేతిలో ఉన్నవి జారిపోయినా నిరుత్సాహపడకుండా వేరొక పని చేసుకోవడానికి ఇలా అవకాశం వచ్చిందని సానుకూల మనస్తత్వంతో ఆలోచించాలి.
కృతజ్ఞతాభావం కలిగి ఉండటం!!
◆ ఎదుటి వ్యక్తుల నుంచి పొందిన సహాయాన్ని మరచిపోకుండా ఉండటం ఎంతో ముఖ్యం.
◆ పొందిన సహాయానికి ఎదుటి వ్యక్తులకు కృతజ్ఞతలు చెప్పడం వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. అలా చేయడం వల్ల మనుషుల్లో అహం అనేది ఉండదు.
◆ కృతజ్ఞతాభావం వ్యక్తం చేయడమంటే జీవితంలో వ్యక్తులను, సహాయం చేసిన వారిని గౌరవించడం అని అర్థం. దానివల్ల వ్యక్తుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు ఉంటాయి.
రోజులో జరిగిన విషయాలను రాసుకోవడం!!
◆ ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునేవరకు ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. వాటిలో మంచి ఉండచ్చు చెడు ఉండచ్చు.
◆ చేసిన మంచిని కాకుండా పొందిన సహాయాన్ని గుర్తుపెట్టుకోవాలని అందరూ చెబుతారు.
◆ ఇతరుల నుంచి పొందిన సహాయాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు ఒక నోటు పుస్తకంలో లేదా డైరీలో రాసుకుంటూ ఉండాలి.
◆ మనసుకు బాధ కలిగినప్పుడు ఒకరి నుంచి పొందిన సహాయాల పట్టికను చూశామంటే చిటికెలో బాధ మొత్తం ఎగిరిపోతుంది.
నవ్వుతూ ఉండాలి!!
◆మనుషుల్లో పాజిటివ్ ఆలోచనలు పెరగాలంటే నవ్వుతూ ఉండటం గొప్ప మార్గం. నవ్వు ఆందోళనలను, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు తేల్చి చెప్పారు.
◆ కఠిన పరిస్థితులలోనూ, బాధాకర పరిస్థితులలోనూ చెరగని చిరునవ్వును వెంట ఉంచుకునేవాళ్ళు చాలా గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉంటారని సైకాలజిస్ట్ లు తెలిపారు.
నెగిటివ్ వ్యక్తుల నుండి దూరం ఉండాలి!!
◆ ప్రతిదాంట్లో చెడును చూడటం, ముందే చెడును ఎక్పెక్ట్ చేయడం, ఎప్పుడు చెడు గురించి మాట్లాడటం చేసేవాళ్లను నెగిటివ్ మైండ్ ఉన్న వ్యక్తులుగా పేర్కొనవచ్చు.
◆ నెగిటివ్ మైండ్ ఉన్నవాళ్ళు పాజిటివ్ గా ఉన్న వాళ్ళను కూడా తమ మాటలతో గందరగోళంలోకి నెట్టేస్తుంటారు.
◆ నెగిటివ్ గా ఆలోచించడం, నెగిటివ్ మైండ్ కలిగి ఉండటం ఒక పెద్ద అంటువ్యాధిగా చెప్పచ్చు. అందుకే నెగిటివ్ మైండ్ ఉన్నవాళ్లకు దూరం ఉండాలి.
సెల్ఫ్ - టాక్!!
◆ఎవరిని వారు ప్రశ్నించుకుంటూ, ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉంటే తమలో ఉన్న బలహీనతలు, తప్పులు చాలా తొందరగా గుర్తించగలుగుతారు.
◆ సాధారణంగా చాలాసార్లు మనం బయట ఒక నిర్ణయం తీసుకున్నా మనసులో మాత్రం అది కాదు ఇది, ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మనసు చెప్పేదాన్ని వినడం కూడా నేర్చుకోవాలి.
◆ రోజులో కొంతసేపు ఎవరితోవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ప్రవర్తన విషయంలోనూ, సానుకూల మనస్తత్వ విషయంలోనూ గొప్ప మార్పు వస్తుంది
నెగిటివ్ ఆలోచన తొలగించుకోవడం!!
◆ ఉన్న పరిస్థితులను బట్టి చాలామంది తమ ప్రవర్తన సరిగ్గానే ఉందని అనుకుంటారు. కానీ ఎదుటివారు మాత్రం అందులో తప్పొప్పులను చెప్పగలుగుతారు. అంటే మనం చేస్తున్నది తప్పు అని మనం చాలావరకు తెలుసుకోలేము.
◆ స్నేహితులు, ఆత్మీయుల ద్వారా మనలో ఉన్న ప్రతికూల స్వభావాన్ని, ఆ స్వభావం ఎప్పుడు ఏ విషయాల్లో ఎక్కువ ఉంటుంది అనేదాన్ని గుర్తించవచ్చు. అలా గుర్తించుకున్నాక దాన్ని మెల్లిగా తొలగించాలి.
డాక్టర్ పల్లవి జోషి చెప్పినట్టు పైన మార్గాలు అనుసరించడం వల్ల జీవితంలో సానుకూల దృక్పథం, సానుకూల ఆలోచనలు మెరుగవుతాయి. సానుకూల స్వభావం అనేది అలవాటు అయితే జీవితంలో ఎన్నో ఆందోళనలు అసలు ఆందోళనల్లా, సమస్యల్లానే కనిపించవు.