వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై తెలంగాణ కీలక నిర్ణయం
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తమ వైఖరిని తెలియజేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, తెలంగాణలో కొనసాగుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చుకోవడం వంటి లక్ష్యాలతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థకు మూలధన పెట్టుబడితో పాటు ముడి సరుకుల కోసం నిధులు ఇచ్చి.. ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు ఆసక్తి కలిగినవారికి ఆహ్వానం పలుకుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మార్చి 27న ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఆసక్తి వ్యక్తీకరణ)ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో సింగరేణి తరఫున రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లేదా నీటిపారుదల శాఖ పాల్గొనే అవకాశం ఉంది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తమ వైఖరిని తెలియజేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, తెలంగాణలో కొనసాగుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చుకోవడం వంటి లక్ష్యాలతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ ప్రతిపాదనల కోసం వెంటనే వైజాగ్ వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్నతాధికారుల బృందాన్ని కేసీఆర్ ఆదేశించారు. ఒకట్రెండు రోజుల్లో ఈ బృందం విశాఖపట్నం వెళ్లనుంది.
ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-ఈవోఐ(ఆసక్తి వ్యక్తీకరణ) రూపంలో ప్రైవేటు కంపెనీలను స్టీల్ ప్లాంట్‌లోకి చొప్పించి.. అంతిమంగా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం పన్నిన కుట్ర ఇదని కేంద్రానికి తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్టీల్ ప్లాంట్ ఉద్యోగ, కార్మిక సంఘాల నుంచి సానుకూల స్పందన వచ్చింది.
దీనిపై బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఇటీవల విశాఖలోని స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కలిశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తాత్కాలిక పరిష్కార మార్గాలను ఈ సందర్భంగా వారు వివరించారు. ఈ సమాచారాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి చంద్రశేఖర్ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో చర్చించిన కేసీఆర్ తాజా నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉన్న సింగరేణి సంస్థ ఈవోఐ ప్రక్రియలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ, నీటిపారుదల శాఖలను సైతం ప్రత్యామ్నాయంగా సంసిద్ధం చేస్తున్నారు. ఈవోఐలో పేర్కొన్న ప్రకారం ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా ప్రతిపాదనలు సూచించాల్సి ఉంటుంది.