చంద్రబాబు వెన్నుపోటు ఉదంతాన్ని గుర్తుచేస్తున్న సుప్రీంకోర్టు తీర్పు
మహారాష్ట్ర పరిణామాలపై సుప్రీంకోర్టు జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను జాగ్రత్తగా గమనిస్తే కొన్ని విషయాలు స్పష్టంగా బోధపడతాయి.
చరిత్ర పునరావృతం కాదు. కానీ కొన్ని సంఘటనలు చరిత్రని గుర్తు చేస్తాయి. చారిత్రక తప్పిదాల పర్యవసనాల్ని తలపిస్తాయి. మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టు తీర్పు 1995 సంవత్సరం నాటి మన రాష్ట్ర రాజకీయ పరిణామాల్ని గుర్తు చేసింది. ఆనాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ఉదంతం గుర్తుకొస్తుంది. ఇప్పటి మాదిరిగా ఆనాడు న్యాయమూర్తులు తీర్పు ఇచ్చి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర మరో మలుపు తిరిగి ఉండేది.
మహారాష్ట్ర పరిణామాలపై సుప్రీంకోర్టు జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను జాగ్రత్తగా గమనిస్తే కొన్ని విషయాలు స్పష్టంగా బోధపడతాయి.
1. నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శాసనసభలో ఆధిక్యం కోల్పోయారని నిర్ధారణకు వచ్చేందుకు తన వద్ద తగిన సమాచారం లేనప్పుడు, అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించడం సరికాదు. గవర్నర్ విచక్షణాధికారాలను ఉపయోగించిన తీరు చట్టపరంగా లేదని సుప్రీంకోర్టు తెలిపింది.
2. శివసేన పార్టీలో అంతర్గత వివాదాల ఆధారంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను బలం నిరూపించుకోవాలని కోరడం తగని పని. ఒక పార్టీలోని అంతర్గత వివాదాల పరిష్కారం కోసం బలనిరూపణ అన్న పద్ధతి చట్టపరంగా చెల్లదు. ఈ విధంగా గవర్నర్ తన విచక్షణాధికారాలను వినియోగించిన తీరు ఆమోదయోగ్యం కాదు.
3. ఏక్‌నాథ్ షిందే వర్గానికి చెందిన భరత్ గోగ్వాలేను విప్‌గా స్పీకర్ నియమించడం సైతం చట్టవిరుద్ధం. చీలికవర్గం ఆధారంగా స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకోడం చట్ట సమ్మతం కాదు.
అయితే ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేయకుండా ఉండి వుంటే ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించి ఉండేవారం. కానీ ఆయన బల నిరూపణకు ముందే స్వచ్ఛదంగా రాజీనామా చేయడం వలన ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన తీర్పునిచ్చింది.
ఈ తీర్పును జాగ్రత్తగా గమనిస్తే 1995లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని పడగొట్టిన తీరుపై నాటి న్యాయస్థానం తీర్పు ఈ తీరున ఉండివుంటే చరిత్ర మరోలా వుండేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
1995 ఆగస్టులో చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాల ఫలితంగా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఆనాటి ఉదంతంలో నాటి గవర్నర్ కృష్ణకాంత్, స్పీకర్ యనమల రామకృష్ణుడు పాత్ర ఇప్పటికీ చర్చనీయాంశాలే. ఆనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తరహాలో ఉండివుంటే ఎన్.టి. రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయ్యేవారు. ఆనాటి పరిణామాల్ని అవలోకిస్తే మహారాష్ట్రలో శివసేన పార్టీ అంతర్గత సంక్షోభం మాదిరిగానే నాటి తెలుగుదేశం పార్టీలో సంక్షోభం తలెత్తింది.
నిజానికి అది సంక్షోభం కూడా కాదు. నాటి టిడిపి అధినేత, ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావుకు వ్యతిరేకంగా నారా చంద్రబాబు నాయుడు కుట్ర అని కొందరు అంటారు. ఎన్టీఆర్‌ను గద్దెదించి తాను ముఖ్యమంత్రి కావాలనే దుష్ట తలంపుతోనే ఆ కుట్రకు తలపడ్డారని చెబుతారు. ఎన్.టి.ఆర్ సతీమణి లక్ష్మీపార్వతిని బూచిగా చూపి అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు 1995 ఆగస్టులో చంద్రబాబు కుటిల పన్నాగాలకు పాల్పడ్డారు. 1995 ఆగస్టులో ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు శ్రీకాకుళం పర్యటనకు వెళ్ళారు. ఆ సమయంలో తన కుట్రను వైస్రాయ్ హెూటల్ వేదికగా వేగంగా అమలు జరిపారు(ఈ కుట్ర ఉదంతం వివరాలు ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకంలోనూ చూడొచ్చు).
వైస్రాయ్ హెూటల్‌కు ఎమ్మెల్యేల్ని తరలించే నాటికి నారా చంద్రబాబు నాయుడు వెంట 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు కూడా లేరు. కానీ ఆయన వెంట 120 మంది ఉన్నారని మీడియా ద్వారా ప్రచారం చేయించుకున్నారు. ఎన్టీఆర్ క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు రెవిన్యూ, ఆర్థిక శాఖలు నిర్వహించేవారు. కనుక తమ ఆర్థిక ప్రయోజనాలు ఎన్టీఆర్ కంటే చంద్రబాబు వెంట ఉంటేనే నెరవేరుతాయని ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు పలికారు.
నిబంధనల ప్రకారం పార్టీ అధ్యక్షుడిని మహానాడు (సర్వ ప్రతినిధుల సభ) సమావేశం ద్వారానే తొలగించడం, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోడం జరగాలి. ఈ సమావేశ నిర్వహణకు సైతం అప్పటికే ఉన్న అధ్యక్షుడి అనుమతి కావాలి. దీనికి భిన్నంగా కాచిగూడ బసంత్ టాకీస్‌లో మహానాడును ఏర్పాటు చేసి ఎన్టీఆర్‌ను అధ్యక్ష పదవి నుంచి తనే ఆ పదవిని దక్కించుకున్నారు చంద్రబాబు. ఇది సైతం పార్టీ నియామవళికి విరుద్ధం.
నిజానికి అప్పటికే చంద్రబాబు నాయుడుతోపాటు మరో నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడి హెూదాలో ఎన్టీఆర్ ఆగస్టు 25న స్పీకర్‌కు లేఖ రాశారు. అయినప్పటికీ పార్టీని హస్తగతం చేసుకొని సెప్టెంబర్ 1న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం తెర వెనుక కుట్రల ఫలితమని పరిశీలకులు చెబుతారు.
ఈ అప్రజాస్వామిక విధానాలను సవాల్ చేస్తూ ఎన్టీ రామారావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగ విరుద్ధంగా తనను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని, తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తూ గవర్నర్ కృష్ణకాంత్ నిర్ణయం తీసుకోవడాన్ని ఎన్.టి.రామారావు న్యాయస్థానంలో సవాల్ చేశారు.
ఈ పిటిషన్‌పై విచారించిన ఆనాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.ఎస్.మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. టిడిపిలో చీలికవర్గ నాయకుడయిన చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిగా గవర్నర్ కృష్ణకాంత్ నియమించడాన్ని తన తీర్పులో సమర్థించింది. అది చట్ట సమ్మతమేనని చెబుతూనే నాటి అసెంబ్లీ స్పీకర్ యనమల రామకృష్ణుడు స్పీకర్‌గా తన అధికార పరిధిని మించి వ్యవహరించారని తప్పు బట్టింది. తెలుగుదేశం శాసనసభా పార్టీ పక్షనేతగా చంద్రబాబునాయుడు నియామకాన్ని ప్రకటిస్తూ స్పీకర్ బులెటిన్ జారీ చేయడం స్పీకర్ పరిధి దాటి వ్యవహరించిన వైనంగా అభిశంసించింది.
తాజాగా మహారాష్ట్ర సంక్షోభంపై ఇచ్చిన తీర్పులోనూ సుప్రీంకోర్టు స్పీకర్ పాత్రను చట్టవిరుద్ధంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కనుకనే ఎన్టీఆర్ పదవీచ్యుతి వ్యవహారంలో ఆనాడు స్పీకర్‌గా యనమల రామకృష్ణుడు పోషించిన పాత్ర ప్రశ్నార్థకం. ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధం.
చీలికవర్గం నాయకునిగా తనను తాను ప్రకటించుకున్న చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయించిన ఉదంతానికి ఏక్‌నాథ్ షిండే వ్యవహారంలో మహారాష్ట్ర గవర్నర్ ఉదంతం సరిపోలి వుంది. కానీ ఆనాడు గవర్నర్ కృష్ణకాంత్ పాత్రను హైకోర్టు తీర్పు సమర్థించింది. ఇవాళ మహారాష్ట్ర గవర్నర్ పాత్రని రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంగా తేల్చి చెప్పింది.
నాటి పరిణామాలను గుర్తు చేసుకుంటే, ఆనాడు ఎన్.టి. రామారావును మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు వర్గం అవకాశం ఇవ్వలేదు. వైస్రాయ్ హెూటల్‌కు వెళ్ళడానికి బయలుదేరిన ఎన్టీఆర్ కాన్వాయ్ మీద చంద్రబాబు మనుషులు దాడి చేశారు. ఎమ్మెల్యేలతో మాట్లాడటానికి ఎన్.టి.ఆర్‌కు అవకాశం ఇవ్వలేదు. బసంత్ టాకీస్‌లో జరిపిన మహానాడుకు సైతం ఎన్టీఆర్‌ను పిలవలేదు. అంతేగాక చంద్రబాబునాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఎన్.టి.ఆర్ ఆదేశాలు జారీ చేశాక ఆయనకు మహానాడు నిర్వహించే అధికారం ఎక్కడిది? పార్టీ నియమావళికి, ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలగించే కుట్రకు నాటి చంద్రబాబు నాయుడు వర్గం తెగబడింది.
ఈ పరిణామాల మీద ఇవాల్టి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి విశ్లేషిస్తే గవర్నర్ కృష్ణకాంత్ వ్యవహారసరళి చట్టసమ్మతం, రాజ్యాంగ సమ్మతంగా కాదు. కనుకనే ఆనాడు ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.
ఇక్కడ మరో అంశం ఏమంటే శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మాదిరిగా ఆనాడు ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలగించి టిడిపి చీలికవర్గం నేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆనాటి హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇవాల్టి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు సరళిలో ఉండివుంటే పరిస్థితులు మరోలా వుండేవి.
సుప్రీంకోర్టు తీర్పును అసునరించి నాటి ఆగస్టు 1995 నాటి పరిణామాలను విశ్లేషిస్తే టిడిపి అంతర్గత సంక్షోభాన్ని దృష్టిలో వుంచుకొని గవర్నర్ నిర్ణయం తీసుకోని ఉండకూడదు. స్పీకర్ ఏకపక్షంగా చీలికవర్గం నాయకుడిని టిడిపి శాసనసభా పక్ష నాయకునిగా గుర్తించడమూ చట్టవిరుద్ధమవుతుంది.
ఇప్పటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆనాడు హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చివుంటే ఎన్.టి. రామారావు తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించేవారు. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయకుండా ఉండి వుంటే ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించేవారమని సుప్రీంకోర్టు తీర్పు పేర్కొన్నది. పార్టీ అంతర్గత సంక్షోభాల పరిష్కారం గవర్నర్ల బాధ్యత కాదు, కనుక నాటి టిడిపి లోపలి పరిణామాలకు అనుగుణంగా తన పరిధిని మించి గవర్నర్ వ్యవహరించాడని ఇప్పటి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి భావించాల్సి వస్తుంది.
చరిత్ర పునరావృతం కాదు. కాని చారిత్రక తప్పదాలు పునరావృతం కాకుండా చూసుకోడం మన చేతుల్లోనే ఉంది. రాజ్యాంగాన్ని, చట్టాన్ని కాపాడే బాధ్యతని స్వీకరించిన న్యాయస్థానాలు వాటి సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించడం ధర్మం. ఈ ధర్మాన్ని న్యాయస్థానాలు విస్మరిస్తే జరిగే తప్పిదాలు ఎలా ఉ ంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.