Superstar Krishna: 2,500 అభిమాన సంఘాలున్న ఏకైక హీరో కృష్ణనే!
Superstar Krishna: రోజుకి మూడు షిఫ్టుల్లో బిజీగా ఉంటూ సంవత్సరానికి 10-12-18 దాకా సినిమాల్లో నటించి రికార్డ్ సృష్టించిన హీరో వన్ అండ్ ది ఓన్లీ వన్ కృష్ణనే. సేవాగుణంలో కూడా సూపర్ స్టార్ మిన్నే.
సాహసమే ఊపిరిగా, అభిమానులే ఓ ప్రభంజనంగా తెలుగు వెండితెరపై సరికొత్త సాంకేతిక వెలుగులను ప్రసరింపజేసిన డైనమిక్ సూపర్ స్టార్ కృష్ణ. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలలో హీరోగా, అతిథి నటుడిగా నటించిన నటశేఖరుడు కృష్ణ (320 + 30 ప్లస్). కుటుంబ చిత్రాల హీరోగా, రైతు పాత్రల సారధిగా, నవలా నాయకుడిగానే కాకుండా యాక్షన్, జానపద, పౌరాణిక, చారిత్రక, క్రైం చిత్రాల్లో నటించి మెప్పించిన రియల్ హీరో కృష్ణ. ఇప్పటివరకు సినీ చరిత్రలో ఏ హీరోకూ లేనన్ని అభిమాన సంఘాలు (రిజిస్టర్డ్) ఒక్క కృష్ణకే సాధ్యమైంది. ఆయన అభిమాన సంఘాల సంఖ్య 2,500 అంటే, ఆయనని అభిమానులు ఎలా గుండెల్లో పెట్టుకున్నారో అర్థమైపోతుంది.
ఇన్ని ఫస్ట్‌లు కృష్ణ సొంతం!
తెలుగు ప్రేక్షకుల వరకు.. కృష్ణే ఓ కౌబాయ్, ఓ జేమ్స్ బాండ్ హీరో. ఏ కొత్త సాంకేతికత వచ్చినా అది కృష్ణ నిర్మించిన చిత్రాల ద్వారా లేక కృష్ణ నటించిన చిత్రాల ద్వారా తెలుగు తెరకు పరిచయం కావాల్సిందే. తొలి తెలుగు హాలీవుడ్ తరహా తెలుగు చిత్రం, తొలి తెలుగు సినిమా స్కోప్ చిత్రం, తొలి తెలుగు 70 ఎంఎం చిత్రం, తొలి తెలుగు స్టీరియోఫోనిక్ సౌండ్ చిత్రం, తొలి తెలుగు డీటీయస్ చిత్రం, తొలి తెలుగు సాంఘిక వర్ణ ఈస్ట్ మన్ కలర్ చిత్రం, తొలి తెలుగు ఆర్వో కలర్ చిత్రం, తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం.. ఇన్ని ఫస్ట్ లు.. ఇవన్నీ కృష్ణ చిత్రాల ద్వారానే తెలుగు తెరకు పరిచయం. అలా తెలుగు సినిమా సాంకేతిక అభివృద్ధికి మూల స్తంభం సూపర్ స్టార్ కృష్ణ కావడం ఆయన అభిమానులకే కాదు.. తెలుగు ప్రేక్షకులకే గర్వకారణం. ఏ ఇతర హీరోకి లేని ఘనచరిత్ర ఇది. రెమ్యునరేషన్ విషయంలో పట్టింపులేని నిర్మాతల హీరో. సాహసమే ఆయన మొదటి అడుగు.. పట్టుదలే ఆయన మలి అడుగు.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సాధించి చూపించడమే ఆయన ధ్యేయం. ఎన్టీఆర్ తో మూడు సార్లు, ఏఎన్ఆర్‌తో ఒకసారి విభేదించినా కూడా తరువాత ఆ ఇద్దరితోనూ సినిమాలు నిర్మించి విజయాలు సాధించిన మంచి మనసున్న మనిషి హీరో కృష్ణ.
లక్ష రూపాయలున్న బడ్జెట్‌ను కోటికి తీసుకెళ్లిందీ కృష్ణనే
లక్షల్లో ఉన్న తెలుగు సినిమా వ్యయం కోటి రూపాయలు దాటించిన హీరో, నిర్మాత కూడా కృష్ణనే . నెంబర్ వన్ బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరిని తెలుగు తెరకు, నెంబర్ వన్ తెలుగు హీరోయిన్ శ్రీదేవిని హిందీ తెరకు పరిచయం చేసి ఇద్దర్నీ మరోసారి నెంబర్ వన్ చేసిన ఘనత కూడా మన సూపర్ స్టార్ కృష్ణదే. రోజుకి మూడు షిఫ్టుల్లో బిజీగా ఉంటూ సంవత్సరానికి 10-12-18 దాకా సినిమాల్లో నటించి రికార్డ్ సృష్టించిన హీరో వన్ అండ్ ది ఓన్లీ వన్ కృష్ణనే. సేవాగుణంలో కూడా సూపర్ స్టార్ మిన్నే. తెలుగు నాట 2,500 కి పైగా అభిమాన సంఘాలు ఏర్పాటైన ఏకైక హీరో కృష్ణ. సింహాసనం చిత్రం శతదినోత్సవ సభకి 12 కిలో మీటర్ల వరకూ వాహనాలు బారులుతీరి పార్క్ చేయబడటం ఓ వింత, ఓ విశేషం.