Telugu Global
NEWS

శ్రీ చైతన్య నార్సింగి క్యాంపస్‌లో అడ్మిషన్లు నిషేధం

''శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నార్సింగి క్యాంపస్ లో వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త విద్యార్థులను చేర్చుకోకుండా నిషేధించారు. అయితే, ఇప్పటికే ఉన్న విద్యార్థులు వారి రెండవ సంవత్సరం చదువును కొనసాగిస్తారు. ”అని ఒక సీనియర్ అధికారి తెలిపారు.

శ్రీ చైతన్య నార్సింగి క్యాంపస్‌లో అడ్మిషన్లు నిషేధం
X

శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, నార్సింగి క్యాంపస్‌లో వచ్చే విద్యా సంవత్సరంలో అంటే 2023-24లో తాజా అడ్మిషన్లు తీసుకోకుండా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) నిషేధించింది.

సిబ్బంది వేధింపుల కారణంగా శ్రీ చైతన్య నార్సింగి క్యాంపస్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎన్ సాథ్విక్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో TSBIE ఈ నిర్ణయం తీసుకుంది..

సోమవారం హైదరాబాద్‌లో విద్యాశాఖ అధికారులు, కార్పొరేట్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల యాజమాన్యాల మధ్య జరిగిన సమావేశంలో అనేక నిర్ణయాలను తీసుకున్నారు.

''శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నార్సింగి క్యాంపస్ లో వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త విద్యార్థులను చేర్చుకోకుండా నిషేధించారు. అయితే, ఇప్పటికే ఉన్న విద్యార్థులు వారి రెండవ సంవత్సరం చదువును కొనసాగిస్తారు.” అని సమావేశంలో పాల్గొన్న‌ ఒక సీనియర్ అధికారి తెలిపారు.

కార్పోరేట్‌, జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు, సిబ్బంది ఏదైనా సాకుతో విద్యార్థులను మాటలతో, శారీరకంగా హింసిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డ్ హెచ్చరించింది.

ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ఐపిఇ) మార్చి 15 నుండి ప్రారంభం కానుండగా, విద్యార్థుల కోసం వినోద కార్యక్రమాలను నిర్వహించడం, విద్యార్థులకు సరైన నిద్ర ఉండేలా చూడ‌డంతో పాటు విద్యార్థుల్లో సరైన మానసిక ఆరోగ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని కళాశాలలను ఆదేశించింది.

విద్యార్థుల్లో ఆత్మహత్యా ధోరణిని గుర్తించి మానసిక నిపుణుల ద్వారా వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని యాజమాన్యాలకు అధికారులు సూచించారు. తరగతులు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఆత్మహత్యలను అరికట్టడానికి, విద్యార్థులలో ఒత్తిడిని తగ్గించడానికి మార్గదర్శకాలను రూపొందించడం కోసం 10 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలకు చెందిన ఏడుగురు సభ్యులు, ముగ్గురు టీఎస్ బీఐఈ అధికారులు ఉంటారు. విద్యార్థులను ఆకర్షించడానికి తప్పుదోవ పట్టించే ప్రకటనలను నియంత్రించేందుకు ఈ కమిటీ మార్గదర్శకాలను రూపొందించనుంది.

" కొన్ని కార్పొరేట్ కళాశాలలు టాప్ వన్ ర్యాంకర్‌ను తమ విద్యార్థి అని క్లెయిమ్ చేస్తున్నాయి, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే. కాలేజీలు ప్రచారం చేసుకోవచ్చు కానీ ప్రజలను తప్పుదోవ పట్టించకూడదు. మేము త్వరలో మార్గదర్శకాలను రూపొందిస్తాము, ”అని సీనియర్ అధికారి తెలిపారు.

First Published:  7 March 2023 6:53 AM IST
Next Story