ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.1.90 లక్షల బోనస్
కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేల చొప్పున బోనస్ ఇస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ గా రూ.1.90 లక్షలు ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్ట విక్రమార్క ప్రకటించారు. శుక్రవారం సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పోగా మిగిలిన మొత్తంలో 33 శాతం లాభాలను కార్మికులకు బోనస్ గా ఇస్తున్నామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఒక్కో కార్మికుడికి రూ.1.70 లక్షల లాభాల బోనస్ ఇవ్వగా, ఈసారి రూ.20 వేలు పెంచి రూ.1.90 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. సంస్థలో పని చేస్తున్న 41,837 మంది పర్మినెంట్ కార్మికులు ఈ బోనస్ అందజేస్తామన్నారు. సంస్థలో 26 వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ పని చేస్తున్నారని.. సంస్థ చరిత్రలోనే మొదటిసారిగా ఒక్కో కార్మికుడికి రూ.5 వేలు బోనస్ గా అందజేస్తున్నామని తెలిపారు. దసరా పండుగకు ముందే ఈ బోనస్ అందజేస్తామని తెలిపారు. అలాగే సింగరేణి సంస్థను విస్తరించడం ద్వారా కార్మికుల భవిష్యత్ కు భరోసా ఇస్తామన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ హౌస్ ఏర్పాటు చేస్తామన్నారు. రామగుండం ప్రాంతంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ లో అదనంగా రెండు 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని, ఇందులో ఒక యూనిట్ టీజీ జెన్ కో తో కలిసి, ఒక యూనిట్ సింగరేణి సంస్థ సొంతగా ఏర్పాటు చేస్తుందున్నారు. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ లో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మా ప్రభుత్వం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో సింగరేణి కార్మికులు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దసరా ముందు సింగరేణిలో లాభాల వాటా పంచడం ద్వారా కార్మికుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతున్నామని తెలిపారు.