Telugu Global
NEWS

ఒక్కటైన సిద్ధార్థ్, అదితిరావు

నటుడు సిద్ధార్థ్‌ , నటి అదితిరావు హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ జంట పెళ్లి ఫొటోలు వైరల్‌గా మారాయి.

ఒక్కటైన సిద్ధార్థ్, అదితిరావు
X

నటుడు సిద్ధార్థ్‌ , నటి అదితిరావు హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇద్దరి కుటుంబ పెద్దల సమక్షంలో వనపర్తిలోని శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను అదితీ స్వయంగా సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ అదు సిద్ధు’’ అని అదితి ఆ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం సిద్దార్థ్, అదితీ పెళ్లి ఫొటోలు వైరల్‌గా మారాయి. కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.

సిద్ధార్థ్, అదితి చాలాకాలం నుంచి ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అయితే వీరిద్దరి రహస్యంగా పెళ్లి చేసుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో తమ పెళ్లి కాలేదని.. కేవలం ఎంగేజ్మెంట్ మాత్రం జరిగిందంటూ ఫోటోలతో క్లారిటీ ఇచ్చారు. ఇక పెళ్లి కూడా అదే ఆలయంలో చేసుకుంటామని అప్పట్లోనే ఈ జంట చెప్పింది. చెప్పినట్టుగానే రంగనాథస్వామి ఆలయంలోనే సిద్ధార్థ్, అదితి వివాహం చాలా సింపుల్ గా జరిగినట్లు తెలుస్తోంది.

‘మహా సముద్రం’ సినిమా సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి అది స్నేహంగా మారి, తనకెంతో ఇష్టమైన ప్రదేశంలో సిద్ధార్థ్‌ తనకు ప్రపోజ్‌ చేశాడని ఇటీవల అదితి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మా నాన్నమ్మ అంటే నాకెంతో ఇష్టం. హైదరాబాద్‌లో ఆమె ఒక స్కూల్‌ ప్రారంభించారు. అది నాకెంతో ప్రత్యేకం. నా చిన్ననాటి రోజులు అక్కడే ఎక్కువగా గడిపా. కొన్నేళ్లక్రితం ఆమె కన్నుమూశారు. ఈ విషయం సిద్ధార్థ్‌కు తెలుసు. ఓ రోజు నా వద్దకువచ్చి.. ఆ స్కూల్‌కు తీసుకువెళ్లమని అడిగాడు. మార్చిలో మేమిద్దరం అక్కడికి వెళ్లాం. అక్కడే మోకాళ్లపై కూర్చొని.. అతను నాకు ప్రపోజ్‌ చేశాడు. ఆమె ఆశీస్సుల కోసమే తాను అక్కడ ప్రపోజ్‌ చేసినట్లు చెప్పాడు’ అని అదితి తెలిపారు.

First Published:  16 Sept 2024 2:17 PM IST
Next Story