Telugu Global
NEWS

నాకు ఎవరితోనూ పోటీ లేదు.. నాకు నేనే పోటీ - రజినీకాంత్

జైలర్ సినిమా ఈవెంట్ లో భాగంగా 'అర్థమైందా రాజా' అని తాను చేసిన వ్యాఖ్యలు విజయ్ ని ఉద్దేశించి కాదని, కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు

నాకు ఎవరితోనూ పోటీ లేదు.. నాకు నేనే పోటీ - రజినీకాంత్
X

తమిళ అగ్ర హీరో విజయ్ గురించి తాను తప్పుగా మాట్లాడినట్లు జరుగుతున్న ప్రచారంపై సూపర్ స్టార్ రజినీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్‌ని తాను విమర్శించలేదని తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. రజినీకాంత్ తాజాగా నటిస్తున్న సినిమా `లాల్ సలామ్`. ఈ సినిమాకు రజినీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుండగా విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రజినీ అతిథి పాత్రలో మెరవబోతున్నారు.

తాజాగా ఈ సినిమా ఆడియో ఈవెంట్ చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. జైలర్ సినిమా ఈవెంట్ లో భాగంగా 'అర్థమైందా రాజా' అని తాను చేసిన వ్యాఖ్యలు విజయ్ ని ఉద్దేశించి కాదని, కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. విజయ్ తన కళ్ళ ముందు పెరిగాడని, టాలెంట్, పట్టుదలతో ఈ స్థాయికి చేరుకున్నాడన్నారు. తాను విజయ్ ని విమర్శించినట్లు జరుగుతున్న ప్రచారం తనను బాధించిందని చెప్పారు. ఇండస్ట్రీలో తనకు ఎవరితో పోటీ లేదని, నాకు నేనే పోటీ.. అని అన్నారు. అభిమానులకు తాను చెప్పేది ఒక్కటే అని.. హీరోలను పోల్చి చూడవద్దని సూచించారు.

ఐశ్వర్య మాటలకు రజినీ కంటతడి

సోషల్ మీడియా వేదికగా తన తండ్రి రజినీకాంత్ పై నెగటివిటీ వ్యాప్తి చేయడంపై ఆయన కుమార్తె ఐశ్వర్య ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రి సంఘీ అంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని, అలా ప్రచారం చూస్తుంటే బాధ కలుగుతోందని చెప్పారు.

సంఘీ అంటే ముందు తనకు అర్థం కూడా తెలియదని, ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చే వారిని సంఘీ అని పిలుస్తారని తర్వాత తెలుసుకున్నట్లు చెప్పారు. రజినీకాంత్ ఎప్పటికీ సంఘీ కాదని, అలా అయితే ఆయన లాల్ సలామ్ వంటి సినిమాను ఒప్పుకునేవారు కాదని అన్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్య ప్రసంగిస్తున్న సమయంలో వేదికపై తన కుమార్తె మాటలు వింటూ రజినీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

First Published:  27 Jan 2024 3:41 PM IST
Next Story