హ్యాట్రిక్ మిస్.. ఎంతపని చేశావ్ సింధూ!
తొలి గేమ్‌లో గెలిచే అవకాశం చేజార్చుకున్న సింధు ఆ తరువాత పుంజుకోలేకపోయింది. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో సింధూ ఇదే బిన్‌జియావోను ఓడించి కాంస్య పతకాన్ని గెలవడం విశేషం.
రియో ఒలింపిక్స్‌లో రజతం.. టోక్యోలో కాంస్యంతో యావత్ దేశం గర్వపడేలా చేసిన బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధూ.. పారిస్ ఒలింపిక్స్‌లో తీవ్ర నిరాశ పరిచింది. హ్యాట్రిక్ అంచనాలతో బరిలోకి దిగినా.. క్వార్టర్స్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది. గురువారం బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో చైనా క్రీడాకారిణి హే బిన్‌జియావో చేతిలో 19-21, 14-21తో సింధూ ఓడిపోయింది.
తొలి నుంచి చైనా అమ్మాయి ఆటపై పట్టు నిలుపుకుంటూ సింధూపై ఒత్తిడి పెంచింది. తొలి గేమ్‌లో గెలిచే అవకాశం చేజార్చుకున్న సింధు ఆ తరువాత పుంజుకోలేకపోయింది. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో సింధూ ఇదే బిన్‌జియావోను ఓడించి కాంస్య పతకాన్ని గెలవడం విశేషం.
దేశానికి ఒలింపిక్స్ మూడో పతకం అందించే అవకాశం చేజారడంపై సింధూ నిరాశ వ్యక్తం చేసింది. తొలి గేమ్‌లో గెలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేదని తెలిపింది. వచ్చే ఒలింపిక్స్ ఆడుతానా లేదా అనేది ఇప్పుడు అనవసరమని.. దానికి ఇంకా నాలుగేళ్ల టైమ్ ఉందని తెలిపింది. ఈ నాలుగేళ్లలో ఏదైనా జరగొచ్చంది. ముందు ఇండియాకు వెళ్లి బాగా రెస్ట్ తీసుకుంటానంది సింధూ.