Telugu Global
NEWS

నాపై అసత్య వార్తలు రాస్తే ఊరుకోను.. దిల్ రాజు ఆగ్రహం

ప్రతి సంక్రాంతికి భారీగా సినిమాలు విడుదలవుతుంటాయని, సంక్రాంతి వచ్చిందంటే చాలు ఏదో ఒక రకంగా తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

నాపై అసత్య వార్తలు రాస్తే ఊరుకోను.. దిల్ రాజు ఆగ్రహం
X

టాలీవుడ్‌లో సినిమాలకు అతిపెద్ద సీజన్ సంక్రాంతి. అందుకే ఈ పండుగకు సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు పోటీ పడుతుంటారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు అగ్ర హీరోలు నటించిన సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్‌కు పోటీప‌డుతుంటాయి.

ఈసారి కూడా సంక్రాంతికి ఐదు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధమ‌య్యాయి. థియేటర్ల కొరత కారణంగా రవితేజ హీరోగా నటించిన `ఈగల్` విడుదల వాయిదా పడింది. మహేష్ బాబు `గుంటూరు కారం`, తేజ సజ్జ `హనుమాన్`, వెంకటేష్ `సైంధవ్`, నాగార్జున `నా సామిరంగ` బరిలో నిలిచాయి. అయితే సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమాల్లో కొన్ని సినిమాలకే థియేటర్లు దొరుకుతున్నాయని.. మిగిలిన వాటికి దొరకడంలేదనే ప్రచారం మొదలైంది.

నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గుంటూరు కారం సినిమాకే ఎక్కువ థియేటర్లు కేటాయిస్తున్నారని విమర్శలు వచ్చాయి. హనుమాన్ సినిమాను వాయిదా వేసుకోవాలని దిల్ రాజు చెప్పినట్టు ప్రచారంలోకి వచ్చింది. హనుమాన్ సినిమాకు థియేటర్లు దక్కకుండా చేశారని, ఆ సినిమాకు అన్యాయం జరుగుతోందని వార్తలు వచ్చాయి. దీనిపై దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి సంక్రాంతికి భారీగా సినిమాలు విడుదలవుతుంటాయని, సంక్రాంతి వచ్చిందంటే చాలు ఏదో ఒక రకంగా తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే తనపై రాళ్లు వేస్తున్నారని విమర్శించారు.

తనపై తప్పుడు వార్తలు రాసే వెబ్ సైట్ల తాటతీస్తా.. అని దిల్ రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి తనపై చేసిన వ్యాఖ్యలను కొన్ని వెబ్ సైట్లు వక్రీకరించి రాశాయ‌ని, తన గురించి తప్పుగా రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు.

తెలుగు సినిమాల కోసం తాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న తమిళ సినిమా అయలాన్‌ను వాయిదా వేసినట్లు తెలిపారు. హనుమాన్ సినిమాను విడుదల చేయాలని తానే చెప్పానన్నారు. నైజాంలో గుంటూరు కారం, హనుమాన్ సినిమాలకు తగినన్ని థియేటర్లు ఉన్నాయని, సైంధవ్, నా సామిరంగ సినిమాలకు థియేటర్లు దొరకడం లేదని దిల్ రాజు చెప్పారు.

First Published:  8 Jan 2024 2:47 PM GMT
Next Story