యాత్రలు, చర్చలు.. పవన్ యాక్షన్ ప్లాన్ ఇదే..!
క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన వలంటీర్లు, వీర మహిళలతో అక్టోబర్‌లో విస్తృత స్థాయి సమావేశానికి పవన్ సిద్ధమవుతున్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టబోతున్నారు.
పవన్ కల్యాణ్ మళ్లీ పొలిటికల్ మూడ్ లోకి వచ్చేశారు. పార్టీ కార్యకలాపాలు రాబోయే రోజుల్లో జరగాల్సిన సమావేశాలు, యాత్రలపై ఆయన నేతలతో చర్చలు జరిపారు. నవరాత్రి పర్వదినాల సందర్భంగా పంచమి తిథి వేళ హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన సరస్వతి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పూజించి రెండు తెలుగు రాష్ట్రాలకు శుభాలు కలుగజేయాలని ప్రార్థించారు. ఈ పూజా కార్యక్రమానికి జనసేన కీలక నేతలు హాజరయ్యారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమయ్యారు పవన్.
అక్టోబర్‌లో కీలక సమావేశాలు..
వాస్తవానికి దసరా నుంచి పవన్ కల్యాణ్ రాజకీయ యాత్ర మొదలు కావాల్సి ఉంది. దాని కోసం ఇప్పటికే బస్సును కూడా రెడీ చేశారు. కానీ చివరి నిమిషంలో యాత్ర వాయిదా పడింది. అయితే అక్టోబర్‌లో క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన వలంటీర్లు, వీర మహిళలతో విస్తృత స్థాయి సమావేశానికి పవన్ సిద్ధమవుతున్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టబోతున్నారు.
అనుష్టుమ్ నరసింహ యాత్ర..
నరసింహ క్షేత్రాల సందర్శన కోసం పవన్ కల్యాణ్ ప్రతి ఏడాదీ అనుష్టుప్ నరసింహ యాత్ర చేపడతారు. కొండగట్టు ఆంజనేయ స్వామికి తొలి పూజలు నిర్వహించి ఆ తర్వాత, ధర్మపురి నరసింహ స్వామిని దర్శించుకుంటారు. ఈ యాత్ర గురించి కూడా పార్టీ నేతలతో పవన్ చర్చించినట్టు తెలుస్తోంది. యాత్ర అనంతరం తెలంగాణ నాయకులతో పవన్ ప్రత్యేకంగా సమావేశం అవుతారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చిస్తారు.
సోషల్ మీడియాపై ఫోకస్..
జనసేన పార్టీ ప్రధానంగా సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా వైసీపీ-టీడీపీ మధ్య విడిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాని జనసేన బాగా వాడుకుంటోంది. జనసేన సోషల్ మీడియా టీమ్, శతఘ్ని టీమ్ పార్టీ ప్రచారం కోసం పనిచేస్తున్నాయి. ఈ రెండు టీమ్ లను మరింత బలపరిచేందుకు పవన్ కల్యాణ్ స్వయంగా వారితో సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. జిల్లాలవారీగా సమీక్షలు పెట్టబోతున్నారు. కృష్ణా జిల్లాతో ఈ సమావేశాలు మొదలవుతాయని అంటున్నారు. నాసేన-నావంతు అనే పేరుతో చేపట్టిన విరాళాల కార్యక్రమం గురించి కూడా పవన్ నాయకులతో మాట్లాడారు.